చెన్నై : కరోనా నుంచి 97 ఏళ్ల వృద్దుడు కోలుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇదివరకే పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కరోనాను జయించి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైద్యులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది, చెప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలతో 97 ఏళ్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిని మే 30న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే అంతకుముందే రక్తపోటు, గుండె జబ్బు లాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కానీ ఆయన కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని డాక్టర్ విజయలక్ష్మీ బాలకృష్ణన్ అన్నారు. కరోనా వస్తే ప్రాణం పోతుంది అన్న అపోహ వద్దు. జీవితం ఎప్పుడూ మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. దాన్ని సద్వినియోగించుకొని యుద్ధంలో గెలవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. (పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ! )
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 11,458 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం 14,723 యాక్టివ్ కేసులుండగా, రికవరీ రేటు 52 శాతంగా ఉంది. ఇక కరోనాతో ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అత్యధిక మొత్తంలో డబ్బు గుంజుతున్న నేపథ్యంలో తమిళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయవలసిన ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. అసింప్టమాటిక్ లేదా తేలికపాటి లక్షణాలు ఉంటే రోజుకు ఐదు వేల రూపాయల నుంచి కేసు తీవ్రతను బట్టి గరిష్టంగా 15,000 రూపాయల వరకు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా వీరికి కూడా ఆరోగ్య బీమా పథకం వర్తింపజేసింది. దీని ప్రకారం కరోనా రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ప్రభుత్వం నుంచి సహాయం అందించనుంది. (మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా ?! )
Comments
Please login to add a commentAdd a comment