మరో మంత్రికి లంచం మరక!
బార్ లైసెన్సులను పునరుద్ధరించేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలతో కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి రాజీనామా చేశారో లేదో.. వెంటనే మరో మంత్రి మీద కూడా ఇవే తరహా ఆరోపణలు వచ్చాయి. బార్ లైసెన్సులను రెన్యువల్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి కె.బాబు రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని తాజాగా ఆరోపణలొచ్చాయి. ఇందులో కొంత మొత్తాన్ని తాను సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలోనే మంత్రి కె.బాబుకు అందజేసినట్లు హోటల్ యజమాని బిజు రమేష్ ఆరోపించారు. మిగిలిన మొత్తాన్ని కూడగట్టేందుకు పలువురు బార్ ఓనర్లు కలిసినట్లు ఆయన చెబుతున్నారు. తాను 50 లక్షలు ఇచ్చానని ఆయన విలేకరులకు చెప్పారు.
అయితే, ఇవన్నీ తన మీద కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలేనని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి కె.బాబు చెబుతున్నారు. రమేష్‌కు చెందిన తొమ్మిది బార్లను మూయించినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని బాబు అన్నారు. తనపై ఆయన చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే వాటిని మేజిస్ట్రేట్‌కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. గతంలో కూడా కె.బాబుపై రమేష్ ఆరోపణలు చేశారు. కానీ ఆధారాలు లేవని విజిలెన్స్ శాఖ పట్టించుకోలేదు.
కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్‌తో పాటు మొత్తం ఏడు పార్టీలున్నాయి. ఇక ఆరు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయనగా.. వరుసపెట్టి మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిగితే సీఎం ఊమెన్ చాందీ కూడా నిందితుడు అవుతారని, ఇప్పటికి బయటపడింది కొంతేనని, అసలైనది ఇంకా చాలా ఉందని సీపీఎం నేత కొడియెరి బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు.