అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. జయ మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు పన్నీర్ సెల్వం కోటి నగదు ఆఫర్ చేశారు. పళనిస్వామికి మద్దతిచ్చేందుకు శశికళ ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నగదుతో పాటు బంగారం ఆఫర్ ఇవ్వడం జరిగింది.
ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిదక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ స్వయంగా కెమెరా సాక్షిగా చెప్పడం గమనార్హం. తనకు రూ.6 కోట్లు ఇస్తామన్నారని కెమెరా సాక్షిగా ఎమ్మెల్యే శరవణన్ పెదవి విప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తనియవరసు, కరుణసు, ఏకే బోస్‌లకు రూ.10 కోట్లు ముట్టాయని ఆయన వెల్లడించారు. కాగా అప్పట్లో కూవత్తూర్ గోల్డ్ బే రిసార్ట్స్ సాక్షిగా చిన్నమ్మ ...ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు.
ఆ శిబిరం నుంచి శరవణన్ మారువేషంలో తప్పించుకుని వచ్చారు. తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీఎం పదవికి పన్నీర్ సెల్వం అడ్డం తిరగడంతో మొదలైన తమిళ రాజకీయ సంక్షోభం చివరకు ప్రలోభాల వరకూ దారి తీయడం సంచలనం రేపుతోంది. పళనిస్వామి వర్గం ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం వల్లే ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శరవణన్ చెప్పిన విషయాలు వాస్తవమా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.