మాకు పూర్తి బలం ఉంది: అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే బలనిరూపణ అంశాన్ని కనుమరుగు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చెన్నైలో నేడు ఎమ్మెల్యేలందరితో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 12న నిర్వహించబోయే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కోసమే అని చెబుతున్నప్పటికీ.. సంఖ్యా బలం చూపించుకునేందుకే ఈ ఎమ్మెల్యేల సమావేశం విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది.
"ఎమ్మెల్యేల సమావేశానికి 111 మంది హాజరయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఓ ఎమ్మెల్యే హాజరుకాలేకపోయారు. మరికొందరు ఫోన్ ద్వారా మద్ధతు తెలిపారు. మా కూటమిలో ముగ్గురి మద్ధతు కూడా మాకే ఉంది. అందులో స్పీకర్ ధన్ పాల్ కూడా ఉన్నారు. ఈ లెక్కన్న మా పార్టీకి పూర్తి బలం ఉంది'' అని అన్నాడీఎంకే కీలక నేత, మంత్రి డీ జయకుమార్ సమావేశం అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అంతేకాదు మరో గ్రూప్ నుంచి కూడా 9 మంది మద్ధతు మాకే ఉందని, వారు ఫోన్ లో సంప్రదింపులు చేపట్టారని ఆయన అన్నారు. అయితే వాళ్లు దినకరన్ మద్ధతుదారులా? లేక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లా? అన్నది మాత్రం జయకుమార్ స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే సమావేశానికి శశికళ-దికనరన్ వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. తాము హాజరుకాబోమని నిన్ననే ఆ వర్గ నేత తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి కూడా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సెల్వన్ స్పీకర్ ను ప్రశ్నిస్తున్నారు. వర్నర్ విద్యాసాగర్ ను కలసి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని తెలియజేయటం ద్వారా ఆ 19 మంది పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ధన్ పాల్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే.