రాజస్థాన్‌లో నేడే పోలింగ్
జైపూర్: రాజస్థాన్‌లో ఆదివారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 200 స్థానాలకుగానూ 199 స్థానాల్లో జరగనున్న పోలింగ్‌కు 47,223 పోలింగ్ కేంద్రాలను, 1,21,885 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా 509 కంపెనీల (38,175 మంది సిబ్బంది) సీఆర్పీఎఫ్ బలగాలు సహా 1,19,272 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 10,793 కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. బీఎస్పీ అభ్యర్థి మరణంతో చురు నియోజకవర్గంలో ఎన్నిక డిసెంబర్ 13కు వాయిదా పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీజేపీ రాష్ట్ర చీఫ్ వసుంధరా రాజే సహా 2,087 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 4.08 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.
ఈ ఎన్నికల్లో ఓ హిజ్రాతోపాటు 166 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి పోలింగ్‌ను 10 శాతంపెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి దింపగా బీఎస్పీ 195, సీపీఎం 38, సీపీఐ 23, ఎన్‌సీపీ 16 చోట్ల అభ్యర్థులను నిలిపాయి. ఇతర పార్టీల నుంచి 666 మంది, స్వతంత్రులు 758 మంది బరిలో నిలిచారు. బీజేపీ తరఫున గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ 21 ఎన్నికల సభలు నిర్వహించగా, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ 17 సభలు, ఆ పార్టీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే 83 సభలు నిర్వహించారు.