సాక్షి, ముంబై: ఒకప్పుడు ఓటు వేయడమంటే పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం, అక్కడ ఎన్నికల సిబ్బంది ఇచ్చిన పొడుగాటి బ్యాలెట్ పేపరుపై ఉన్న వివిధ గుర్తుల్లో తమకు నచ్చిన ఒక అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయడం, ఆ తరువాత దాన్ని మడతపెట్టి అక్కడే ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లో వేయడమనే తంతు ఉండేది. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికి కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం పట్టేంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.
బ్యాలెట్ పత్రాల ముద్రణ గత చరిత్ర. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లు అందుబాటులోకొచ్చాయి. ఎన్నికల ప్రక్రియతోపాటు లెక్కింపు, ఫలితాల వెల్లడి కొద్దిసేపట్లోనే ముగుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఈవీఎంలే. దేశంలో 1982లో వీటిని కేరళలోని పరూర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు తొలిసారిగా వినియోగించారు.
ఎలా పనిచేస్తాయంటే..
ఈవీఎంలో అనేక కీలమైన విభాగాలుంటాయి. దీనిని వినియోగించడంద్వారా మనం ఎవరికి ఓటు వేశామనే విషయం సిబ్బందికి కూడా తెలియదు. మీట నొక్కగానే బీప్ శబ్దం వస్తుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తయి లాక్ అవుతుంది.
ఒకవేళ ఓటరు రెండోసారి నొక్కడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రెండు మీటలు ఒకేసారి నొక్కితే దేనికీ ఓటు పడదు. ఆ తర్వాత సిబ్బంది తమవద్ద ఉన్న యంత్రం మీట నొక్కడంతో మరో వ్యక్తికి ఓటు వేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఈవీఎంలు ఆరు వోల్టుల బ్యాటరీతో పనిచేస్తాయి. ఒకవేళ పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఈ యంత్రాలకు అంతరాయం కలగదు. బ్యాటరీతో పనిచేయడంవల్ల మీటా నొక్కగానే ఈవీఎంకు అనుసంధానించిన కంప్యూటర్‌లో ఓటు నమోదవుతుంది. ఏ అభ్యర్థికి ఓటు వేశామో అందులో నమోదవుతుంది. ఇక ఒక్కో ఈవీఎంకు 3,840 ఓట్లను నమోదు చేసుకునే సామర్థ్యముంది. ఇలాంటి యంత్రాలు ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం ఒకటి లేదా రెండింటిని అందుబాటులో ఉంచుతారు.
అదేవిధంగా ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులు మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు బరిలో దిగితే రెండు ఈవీఎంలు ఉంచుతారు. దీన్ని మొదటి ఈవీఎంతో అనుసంధానిస్తారు. ఇలా నాలుగు యంత్రాలను ఒకదానితో మరొకటి అనుసంధానించేందుకు వీలుంది. అంటే ఒకే నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఇబ్బందేమీ ఉండదు. ప్రక్రియ ఎప్పటిలాగే కొనసాగుతుంది.
ఈవీఎం..అదో అద్భుతం
Published Wed, Apr 23 2014 10:31 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement