
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో విషాదం నెలకొంది. ఒక ఆర్మీ ఆఫీసర్ తన పెంపుడు కుక్కను మంటల నుంచి కాపాడి తాను అగ్నికి ఆహుతయ్యాడు. వివరాలు.. కశ్మీర్‌కు చెందిన అంకిత్ బుద్రజా గుల్‌మర్గ్ ఎస్‌ఎస్‌టీసీ మిలటరీ క్యాంపెయిన్‌లో మేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంకిత్ రెండు శునకాలను పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అంకిత్ ఉంటున్న ఇంటికి శనివారం రాత్రి నిప్పు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులతో పాటు ఒక కుక్కను బయటికి పంపించాడు.అయితే మరొక కుక్క లోపలే ఉండిపోవడంతో దానిని రక్షించడానికి వెళ్లి మంటల్లో చిక్కుకున్నాడు. అయితే ఎలాగోలా దానిని బయటకు పంపినా అప్పటికే అంకిత్ 90 శాతం కాలిపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాన్‌మార్గ్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు.