న్యూఢిల్లీ: పీఎన్‌బీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. రాజకీయంగా ఆమోదయోగ్యంకాని ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వమూ తీసుకోబోదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో జైట్లీ శనివారం ప్రసంగించారు. ‘ప్రైవేటీకరణకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. దీంతోపాటుగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేయాలి. నా అభిప్రాయం ప్రకారం భారతీయ రాజకీయాలు ఈ ఆలోచనకు అంగీకరించవు. ఇది సవాలుతో కూడుకున్న నిర్ణయం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 50 శాతానికన్నా తక్కువకు తగ్గించుకోవాలని ఫిక్కీ, అసోచామ్‌లు సూచిస్తున్నాయి. తద్వారా డిపాజిటర్లు, భాగస్వాములపై బ్యాంకుల జవాబుదారీ పెరుగుతుందంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉన్నతస్థాయి ఉదాసీనతే..
పీఎన్‌బీ కుంభకోణానికి బ్యాంకులు, వాటి ఆడిటర్లు, రెగ్యులేటర్లు వ్యవహరించిన తీరే కారణమని జైట్లీ మండిపడ్డారు. వీరి ఉదాసీనత వల్లే రూ.11,400 కోట్ల భారీ మోసం జరిగిందన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమన్నారు. ‘బ్యాంకుల్లోని కొన్ని విభాగాల్లో విలువల్లేకపోవటం, వివిధ దశల్లో పనిచేసే ఆడిటింగ్ వ్యవస్థ సీరియస్‌గా లేకపోవటం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఉన్నత స్థానాల్లో పనిచేసే వారు కూడా వ్యవస్థలో ఏం జరుగుతుందో గుర్తించలేకపోవటం దారుణం. ఆర్థిక వ్యవస్థలో రెగ్యులేటర్ల పాత్ర కీలకం. బ్యాంకుల్లో ఏక్షణం, ఎక్కడ ఏమేం జరుగుతుందో మూడోకన్నుతో చూడాల్సిన బాధ్యత వీరిది. కానీ భారత వ్యవస్థలో రెగ్యులేటర్ల బదులు రాజకీయ నేతలు జవాబుదారీగా మిగిలిపోతున్నారు’ అని జైట్లీ పేర్కొన్నారు. వ్యాపారస్తులు నీతి, నిజాయితీతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. తప్పుచేసిన వారెవరినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment