
అక్షరాలా రూ.2,107 కోట్లు ఖర్చు చేశారు..
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలే నాయకులను ఎన్నుకోవాలి. ఇది భారతదేశానికి ఉన్న ప్రత్యేకత. మరి ఆ ప్రత్యేకతను కొన్ని రాజకీయ పార్టీలు పరిహాసం చేస్తున్నాయా?
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలే నాయకులను ఎన్నుకోవాలి. ఇది భారతదేశానికి ఉన్న ప్రత్యేకత. మరి ఆ ప్రత్యేకతను కొన్ని రాజకీయ పార్టీలు పరిహాసం చేస్తున్నాయా? అవును. ఎన్నికల ప్రచారంలో పరిమితిని మించి డబ్బు ఖర్చు చేయకూడదనే ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధలనలున్నా వాటన్నింటిని పరిహాసం చేస్తూ.. నియమాల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ సకల ఆర్భాటాలు, హాంగులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలేవో ఓ సారి చూద్దాం..
దేశంలో వివిధ రాజకీయ పార్టీలు 2004 నుంచి 2015 వరకు జరిగిన అన్ని రకాల ఎలక్షన్స్(లోక్ సభ, అసెంబ్లీ)కు సంబంధించి ఈసీకి అందించిన సమాచారాన్ని పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఏడీఆర్) కళ్లు చెదిరే వాస్తవాలను ముందుంచింది. 2004 నుంచి 2015 వరకు జరిగిన మొత్తం 71 ఎలక్షన్లలో మన రాజకీయ పార్టీలన్నీ కలిపి ప్రచారానికి చేసిన ఖర్చు రూ.2,107 కోట్ల రూపాయలు. కేవలం 2004,2009,2015లలో జరిగిన లోక్ సభ ఎన్నికల కు విరాళాలుగా చెక్కుల రూపంలో పార్టీలకు అందిన మొత్తం 1,300 కోట్లు. నగదు రూపంలో చేరిన మొత్తం 1,039 కోట్లు గా ఉంది.
వీటిలో ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అన్నాడీఎంకే, భారతీయ జనతా దళ్(బీజేడీ), ఎస్ఏడీ లు కేవలం లోక్ సభ ఎన్నికల ప్రచారానికి అందుకున్న మొత్తం రూ.267.14 కోట్లుగా లెక్కల్లో తేలింది. వీటిలో సమాజ్ వాదీ పార్టీ రూ.118 కోట్ల విరాళంతో ప్రథమ స్థానంలో నిలిచింది. కేవలం 2014 లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే పాల్గొన్న ఆప్ కు రూ.51.83 కోట్లు విరాళంగా అందుకున్న పార్టీ రూ.37.66 కోట్లను ప్రచార ఆర్భాటాలకు వినియోగించినట్లు ఈసీకి అందజేసిన వివరాల్లో పేర్కొంది.
లోక్ సభ ఎన్నికల్లో 83 శాతంగా ఉన్న చెక్ ల రూపంలో వచ్చిన విరాళాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 65 శాతంగా ఉన్నాయి. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారానికి రూ. 20,000 కన్నా ఎక్కువ డబ్బును ఖర్చు చేయరాదని ఉంది. కానీ, రాజకీయ పార్టీలకు అందించే ఫార్మాట్ లో ప్రచార ఖర్చుకు సంబంధించి ఎటువంటి నియమం( 20,000 వేల కంటే తక్కువ లేదా 20,000 కంటే ఎక్కువ) లేదని ఏడీఆర్ వివరించింది.