వేతనాల సవరణ, ఇతర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు
న్యూఢిల్లీ: వేతనాల సవరణ, ఇతర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు. దీంతో దేశవ్యాప్తంగా చెక్కుల క్లియరెన్సులు, డబ్బు డిపాజిట్లు, విత్‌డ్రాయల్ వంటి లావాదేవీలు స్తంభించాయి. అయితే ఏటీఎంలు మాత్రం పనిచేయంతో వినియోగ దారులకు కాస్త ఉపశమనం కలిగింది. బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (యూఎఫ్‌బీయూ)లోని 9 యూనియన్ల సభ్యులందరూ సమ్మెలో పాల్గొన్నారని ఆ సంఘం కన్వీనర్ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. నెల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్పందించలేదని, అందుకే సమ్మెకు దిగామన్నారు. వేతన సవరణపై ఐబీఏ ఈ నెల 14న యూఎఫ్‌బీయూతో చర్చలు జరిపిందని, అయితే వేతన వ్యయాలను అతితక్కువగా 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడంతో సమ్మె చేసినట్లు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా వెల్లడించారు.
రాష్ట్రంలో సమ్మె విజయవంతం
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు యూనియన్లు ఇచ్చిన ఒక రోజు సమ్మె రాష్ట్రంలో విజయవంతం అయ్యింది. సుమారు 80వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బి.ఎస్.రాంబాబు తెలిపారు. ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ధర్నాలో సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని రాంబాబు స్పష్టం చేశారు.