
భారత్ వచ్చిన బరాక్ ఒబామా దంపతులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు అధికారులు సర్వ సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది.
భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అలాగే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే.