
బెంగళూరు : ‘భూమి మీద నూకలు ఉంటే భూకంపం నుంచైనా బయటపడతాం’ అనే దానికి ఉదాహరణగా నిలిచాడు ఈ చిన్నారి. అనూహ్యరీతిలో మృత్యువును తప్పించుకున్న ఈ బెంగుళూరు చిన్నారి యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన భార్య భర్తలు తమ కుమారుడితో కలిసి బైక్ మీద ప్రయాణిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న ఈ బైక్, తమ ముందున్న మరో బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ చిన్నారి తల్లిదండ్రులు అక్కడే పడిపోయారు. కానీ బైక్ ముందు కూర్చున్న పసివాడు బైక్ మీద అలానే ఉన్నాడు. బైక్ అలానే వాహనాల మధ్యలోంచి దాదాపు 300 మీటర్లు దూరం దూసుకెళ్లింది. అంత దూరం ఆ బైక్ మీద కేవలం ఆ పసివాడు మాత్రమే ఉన్నాడు.
అనంతరం ఆ బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బైక్ డివైడర్‌కు తగిలిన తర్వాత దాని మీద ఉన్న చిన్నారి ఎగిరి డివైడర్ మధ్యలో ఉన్న గడ్డిలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ చిన్నారికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. బైక్ మీద చిన్నారి ఒంటరిగా ప్రయాణించడం గమనించిన తోటి ప్రయాణికులు బాలుడు కింద పడ్డ చోటుకు వెళ్లి సాయం అందించారు. అయితే ఈ ఘటనలో కిందపడిన చిన్నారి తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

Comments
Please login to add a commentAdd a comment