బెంగుళూరు: ప్రపంచం అంతా కరోనాతో సతమతమవుతుంటే కర్ణాటకలో మాత్రం ఫ్లైఓవర్ పేరు మీద వివాదం రాజుకుంటోంది. గురువారం బెంగుళూరులోని యెలహంక వద్ద 400 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రారంభించనున్నారు. దీనికి స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ పేరును నామకరణం చేయనున్నారు. అదే రోజు వీర్ వీర్ సావర్కర్ జయంతి కావడం విశేషం. అయితే మహాత్మాగాంధీ హత్యతో అతడికి సంబంధం ఉన్న కారణాల చేత కాంగ్రెస్, తదితర రాజకీయ పార్టీలు అతడిని దేశ భక్తుడిగా పరిగణించడానికి ఇష్టపడలేవు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా ఫ్లై ఓవర్‌కు అతని పేరును ఖరారు చేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆయన మన రాష్ట్రానికి ఏం చేశాడని అతడి పేరును పెట్టారంటూ గగ్గోలు పెడుతున్నాయి. (యడ్డీ, సిద్దూల మధ్య ఏం జరుగుతుంది!)
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. సీఎం యడియూరప్పది తొందరపాటు చర్యగా అభివర్ణించారు. రూ.34 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌కు సావర్కర్ పేరును పెట్టడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచినట్లవుతుందని పేర్కొన్నారు. జేడీఎస్ నేత హెడీ కుమారస్వామి సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీఎం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడిన ఎందరో ప్రముఖులు ఉన్నారని, ఫ్లైఓవర్‌కు వారి పేరు పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా ప్రతిపక్షాల వ్యాఖ్యలను అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ కొట్టిపారేశారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని సమాధానమిచ్చారు. విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాగా ఫిబ్రవరి 29న జరిగిన బృహత్ బెంగళూరు మహానగర పాలిక కౌన్సిల్ సమావేశంలో ఫ్లైఓవర్‌కు వీర్ సావర్కర్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంటుండగా అసలు దీనిపై చర్చే జరపలేదని కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ వాజీద్ తెలిపారు. ()
Comments
Please login to add a commentAdd a comment