సల్మాన్‌కు ఐదేళ్ల జైలు | Bollywood star Salman Khan jailed for five years for poaching | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు

Published Fri, Apr 6 2018 1:53 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Bollywood star Salman Khan jailed for five years for poaching - Sakshi

గురువారం జోధ్‌పూర్‌ కోర్టు లోపలికి వెళ్తున్న సల్మాన్‌ఖాన్‌

జోధ్‌పూర్‌: కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌(52)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్‌ ఖాన్‌ను పోలీసులు జోధ్‌పూర్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న సహ నటులు సైఫ్‌ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలతో పాటు స్థానిక వ్యక్తి దుష్యంత్‌ సింగ్‌ను ‘బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌’ కింద కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. జైలు శిక్ష మూడేళ్లకు మించి ఉండడంతో బెయిల్‌ కోసం సల్మాన్‌ పైకోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు నిలుపుదల/బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేస్తామని సల్మాన్‌ తరఫు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ తెలిపారు.  

దేశమంతా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి జోధ్‌పూర్‌ కోర్టు వద్ద హడావుడి వాతావరణం కొనసాగింది. మీడియా ఎప్పటికప్పుడు కోర్టు వద్ద పరిణామాల్ని ప్రసారం చేసింది. సల్మాన్‌ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ కేసులో మార్చి 28నే తుది వాదనలు ముగియగా.. చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ దేవ్‌ కుమార్‌ ఖత్రి తీర్పును రిజర్వ్‌ చేశారు. గురువారం

ఉదయం సల్మాన్‌తో పాటు, సైఫ్‌ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలు కోర్టు హాజరైన అనంతరం జడ్జి తీర్పు కాపీని చదువుతూ ‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్‌ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘నిందితుడు ప్రముఖ నటుడు కావడం వల్ల అతడి చర్యల్ని ప్రజలు అనుసరిస్తారు’ అని జడ్జి చెప్పారు. సల్మాన్‌కు ‘బెనిఫిట్‌ ఆఫ్‌ ద ప్రొబేషన్‌ ఆఫ్‌ అఫెండర్స్‌ యాక్ట్‌’ను వర్తింప చేయాలని అతని తరఫు న్యాయవాదులు వాదించారు.

‘కేసులోని వాస్తవాల్ని, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ యాక్ట్‌ను వర్తింపచేయడం న్యాయసమ్మతం కాదు’ అని జడ్జి పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సల్మాన్‌ సోదరీమణులు అల్విరా, అర్పితలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో 9/51 సెక్షన్‌ కింద గరిష్టంగా ఆరేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. తీర్పు అనంతరం పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ పట్ల సానుభూతి ప్రకటించగా.. తీర్పును జంతు హక్కుల కార్యకర్తలు స్వాగతించారు.   

గతంలోనూ ఇదే జైల్లో..: కోర్టు తీర్పు అనంతరం పోలీసులు సల్మాన్‌ను బొలెరో వాహనంలో జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర.. మీడియా సిబ్బంది కవరేజ్, భద్రతా సిబ్బంది పహారాతో హంగామా నెలకొంది. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో సల్మాన్‌ శిక్ష అనుభవించడం ఇది నాలుగోసారి.. వన్యప్రాణుల్ని వేటాడిన కేసుల్లో గతంలో 1998, 2006, 2007ల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్‌ జైల్లో సల్మాన్‌ గడిపారు.

కృష్ణ జింక కేసు సాగిందిలా..

1998, అక్టోబర్‌ 2:  సల్మాన్‌తో పాటు సైఫ్‌ అలీఖాన్, సోనాలీ బెంద్రె, టబు, నీలంపై రాజస్తాన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

2006, ఏప్రిల్‌ 10: ట్రయల్‌ కోర్టు సల్మాన్‌ను దోషిగా ప్రకటించి అయిదేళ్లు జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించింది. వారం పాటు జైల్లో ఉన్న సల్మాన్‌ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

2006, ఆగస్టు 31: ట్రయల్‌ కోర్టు తీర్పుపై రాజస్తాన్‌ హైకోర్టు స్టే.

2016, జులై 25:  సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు.  
2016, నవంబర్‌ 11: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన రాజస్తాన్‌ ప్రభుత్వం.. కేసును మళ్లీ విచారించాలని జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు.


ఖైదీ నెంబర్‌ 106
లక్షలాది మందికి సల్మాన్‌ అభిమాన హీరో కావచ్చు.. అయితే జోధ్‌పూర్‌ జైల్లో మాత్రం అతను ఖైదీ నెంబర్‌ 106. రేప్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు గదికి పక్కనే ఉన్న బ్యారక్‌ను సల్మాన్‌కు కేటాయించారు. తొలి రోజు జైల్లో సల్మాన్‌కు పప్పు, చపాతీ ఇవ్వగా తినేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. సల్మాన్‌ను సాధారణ ఖైదీగానే చూస్తామని, అతని గదిలో చెక్క మంచం, రగ్గు, కూలర్‌ మాత్రమే ఉన్నాయని జైలు సూపరింటెండెంట్‌ విక్రమ్‌ సింగ్‌ చెప్పారు.

కేసుల వీరుడు
సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మంచిపేరు సంపాదించుకున్న సల్మాన్‌ జీవితం ఆ తర్వాత పూర్తిగా వివాదాలమయమే. కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, కటకటాల జీవితం అలవాటుగా మారిపోయింది. సల్మాన్‌ కేసుల చిట్టాలను ఒకసారి పరిశీలిస్తే..

                                           జోధ్‌పూర్‌ జైల్లోని జైలర్‌ కార్యాలయంలో సల్మాన్‌ఖాన్‌

కృష్ణ జింకల కేసు (1998)
హమ్‌ సాథ్‌ సాథ్‌ హై షూటింగ్‌ సమయంలో రాజస్తాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్‌ కాల్చి చంపారని కేసు నమోదైంది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సల్మాన్‌ను జో«««ద్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.  

అక్రమ ఆయుధాల కేసు (1998)
కృష్ణ జింకల్ని చంపే సమయంలో సల్మాన్‌ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదైంది. కృష్ణ జింకల్ని వేటాడడానికి అమెరికాలో తయారైన .22 రైఫిల్, .32 రైఫిల్‌ వాడారని అభియోగాలు నమోదయ్యాయి. 2017, జనవరి 18న కోర్టు ఈ కేసును కొట్టేసింది. సల్మాన్‌ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని కోర్టు పేర్కొంది.

చింకారా కేసు (1998)
హమ్‌ సాథ్‌ సాథ్‌ హై షూటింగ్‌ సమయంలోనే సల్మాన్‌ మూడు చింకారా (లేళ్లు)లను వేటాడారని మరో కేసు నమోదైంది. సల్మాన్‌ ఖాన్‌ భావాడ్‌ గ్రామంలో రెండు లేళ్లు, మాంథానియా గ్రామంలో మరో లేడిని వేటాడారని వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2006లో ట్రయల్‌ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించినా, 2017లో రాజస్థాన్‌ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

హిట్‌ అండ్‌ రన్‌ కేసు (2002)
ముంబైలోని బాంద్రా వీ«ధుల్లో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని సల్మాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినా..2015లో ముంబై హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా తేల్చింది.   

కృష్ణ జింకల ప్రేమికులు..బిష్ణోయి ప్రజలు  

 వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద ఎన్ని కఠిన శిక్షలున్నా.. మూగజీవాల్ని పొట్టనబెట్టుకుంటున్న వేటగాళ్లను శిక్షించడం మనదేశంలో అంత సులువుకాదు. ఇక సరదా కోసం వన్యప్రాణుల్ని చంపే ప్రముఖుల్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమే. బిష్ణోయ్‌ ప్రజలు పోరాడకుండా ఉంటే సల్మాన్‌ విషయంలోను అదే జరిగేదేమో.. ఎంతో ఇష్టంగా చూసుకునే కృష్ణ జింకల్ని సల్మాన్‌ పొట్టన పెట్టుకోవడం కళ్లారా చూసిన రాజస్తాన్‌లోని బిష్ణోయ్‌ తెగ ప్రజలు.. అతను జైలుకెళ్లే వరకూ పోరాటాన్ని కొనసాగించారు. కృష్ణ జింకల కేసులో సల్మాన్‌కు జైలు శిక్ష నేపథ్యంలో కేసు పూర్వాపరాల్ని ఒకసారి పరిశీలిస్తే..






సల్మాన్‌ను వెంటాడిన కంకణి గ్రామస్తులు
1998, అక్టోబర్‌ 1.. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్‌లో ఉన్న సల్మాన్‌ ఇతర బాలీవుడ్‌ తారలతో కలిసి సమీపంలోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని వేటాడారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా నివసించే బిష్ణోయి తెగ ప్రజలకు తుపాకీ చప్పుళ్లతో పాటు జింకల అరుపులు వినిపించాయి. కృష్ణ జింకల పరిరక్షణను యజ్ఞంలా నిర్వహిస్తున్న ఈ తెగవారు హుటాహుటిన వచ్చి చూడగా రక్తపు మడుగులో జింకలు, వాహనంలో పరారైపోతూ సల్మాన్‌ కనిపించారు. గ్రామస్తులు వారిని వెంటాడినా ఫలితం లేకుండా పోయింది. సల్మాన్‌ ప్రయాణించిన జీపు నెంబర్‌ను గుర్తు పెట్టుకున్న వాళ్లు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సల్మాన్‌తో పాటు మిగతావారిపై కేసు నమోదైంది.  

జింక ఇరుక్కుంటే రక్షించానంతే: సల్మాన్‌  
అయితే ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారనేది సల్మాన్‌ ఖాన్‌ వాదన. గతంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘ఆ రోజు షూటింగ్‌ ముగించుకొని మేమందరం వెళుతుండగా ఒక పొదల్లో చిక్కుకుపోయిన జింక పిల్లని చూశాం. పొదల్లోంచి దాన్ని బయటకు తీసి నేనే నీళ్లు పట్టాను. బిస్కెట్లు కూడా తినిపించాను. కాసేపటికి తేరుకున్న ఆ జింక అక్కడ్నుంచి వెళ్లిపోయింది‘ అని చెప్పుకొచ్చారు. జింకకి దగ్గరగా ఉండడం చూసిన గ్రామస్తులు తనను తప్పుగా అర్థం చేసుకొని కేసులు పెట్టారని సల్మాన్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement