
అజిత్ దోవల్, వాంగ్ యీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరుదేశాల ప్రతినిధులు శనివారం సమావేశం కానున్నారు. భారత్ తరఫున జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ చర్చల్లో పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు సమస్యలపై జరిగే సమావేశానికి రెండు దేశాల తరపున ప్రత్యేక ప్రతినిధులుగా అజిత్ దోవల్, వాంగ్ యీ వ్యవహరిస్తున్నారు.
అక్టోబర్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చర్చల తరువాత చైనా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇక్కడకు వస్తుండటం గమనార్హం. ఢిల్లీలో శనివారం జరిగే సమావేశంలో ఇరుదేశాల ప్రతినిధులు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మాట్లాడతారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం 3,448 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉన్న సమస్యలపై ఇరుదేశాలు ఇప్పటికే 20 దఫాల చర్చలు జరిపాయి.