
బడ్జెట్ భగవాన్
దేవుడా! ఈ సారైనా ఇన్‌కమ్‌ట్యాక్స్ బేసిక్ లిమిట్‌ను 3 లక్షలకు పెంచేలా చూడు!!
భగవాన్! నేనో సొంతింటివాణ్ణి కావాలి. తక్కువ ధరలో ఇల్లు దొరికేలా చెయ్యి!!
స్వామీ! పెరిగిన ధరలతో బతకలేకపోతున్నాం. ధరల్ని కిందికి దించు!!
భగవంతుడా! నా పరిశ్రమ బతకాలంటే దిగుమతి సుంకాలు తగ్గేలా చెయ్యి!!
బడ్జెట్ ముందు ఇలాంటి మొక్కులు మామూలే. రైతులు, సామాన్యుల నుంచి వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు దాకా ఎవరి కోరికలువారు వినిపిస్తూ ఉంటారు. దేవుడు అందరికీ వరాలివ్వడు. అలాగే... బడ్జెట్ భగవాన్ అవతారమెత్తే ఆర్థిక మంత్రి కూడా కొందరినేకరుణిస్తుంటారు. మరి ఈసారి అరుణ్‌జైట్లీ వరాలిచ్చిందెవరికి? వాతలేసిందెవరికి?
బడ్జెట్ భగవాన్ అందరికన్నా ఎక్కువ శిక్షించింది పొగరాయుళ్లు, గుట్కా బాబుల్నే. కనికరం మాట అటుంచితే... కక్ష గట్టినట్టుగా సిగరెట్‌తో వాతలు పెట్టారు. గుట్కా, పాన్ మసాలా ముట్టుకుంటే వాత పెడతానని వార్నింగిచ్చారు.
ఎక్కువ కనికరించింది మధ్య తరగతిని, ఉద్యోగినే. పన్ను మినహాయింపు పెంచి ఉద్యోగి జేబులో నేరుగా రూ.5వేలు డిపాజిట్ చేసేశారు. మరింత పొదుపు చేసుకో! మరింత పన్ను మిగుల్చుకో అంటూ కరుణించేశారు.
ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారిని తొందరపెట్టారు. రుణం తీసుకుంటే దానిపై చెల్లించే వడ్డీకి ఐటీ మినహాయింపు మరింత పెంచుతున్నా! కాబట్టి త్వరపడండి అని బడ్జెట్ భగవాన్ పచ్చజెండా ఊపారు.
పరిశ్రమలు పెడదామనుకుంటున్న ఔత్సాహికులకూ వరమే. పాతిక కోట్లకన్నా ఎక్కువ పెట్టి ఉత్పాదక పరిశ్రమ పెడితే 15 శాతం ఇన్వెస్ట్‌మెంట్ అలవెన్స్ ప్రకటించారు. మూడేళ్లు ఈ వరం కొనసాగుతుందని కూడా చెప్పారు. ట
ఇంట్లో టీవీ లేదని అల్లాడిపోయే దిగువ మధ్య తరగతికి చాన్సిచ్చారు జైట్లీ. సీఆర్‌టీ టీవీలు, 19 అంగుళాలకన్నా చిన్నగా ఉండే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీల ధరలు కూడా తగ్గిస్తున్నా... ఇప్పుడే కొనుక్కోమని ప్రకటించేశారు. అరె! మీరేం తక్కువ తిన్నారంటూ ధనవంతులకు కూడా వరమిచ్చారు. విలువైన రాళ్ల ధరలు దించారు.
అదే పనిగా శీతల పానీయాలు తాగే ఫుడ్ షాపర్లను కూడా జైట్లీ వదిలిపెట్టలేదు. మంచినీళ్లు తాగితే సరే! కూల్‌డ్రింకులేంటి? అంటూ పన్ను పోటు వేశారు.మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో దాచుకునేవారికి షాకిచ్చారు జైట్లీ. ఈక్విటీలు కాకుండా ఇతరత్రా పథకాల్లో ఇన్వెస్ట్‌చేసే ఫండ్లలో పెట్టుబడి పెడితే...లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును రెట్టింపు చేశారు.
పాపం! ఇంట్లోకి స్టీలు సామాన్లు కొనుక్కోవాలనుకునే గృహిణులు ఇక కాస్త ఆలోచించాల్సిందే. పన్నులు పెంచటంతో వీటి ధర కూడా స్వల్పంగా పెరిగే చాన్సుంది. ఇంట్లో కారు లేదు... అద్దె ట్యాక్సీలో వెళ్లాలనుకునేవారి జేబులకు సైతం కత్తెర పెట్టారు బడ్జెట్ భగవంతుడు. రేడియో ట్యాక్సీలో వెళితే సౌండ్ పెంచే సర్వీసు తాను మొదలెడతానంటూ బాదేశారు.
ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుని చవగ్గా ఆన్‌లైన్లో, మొబైల్స్‌లో ప్రకటనలిద్దామనుకునే వారినీ జైట్లీ వదిలిపెట్టలేదు. ‘మీరేమో ప్రకటనలకు కొత్త మార్గాలు వెదుక్కుంటున్నారు. మరి నేను కూడా పన్నులకు కొత్త మార్గాలు వెదకాలిగా’ అనే రీతిలో ఝలక్ ఇచ్చారు. దీన్ని కూడా సర్వీసేనంటూ పన్ను చట్రంలోకి తెచ్చేశారు.!!