బగ్గింగ్‌పై పార్లమెంట్‌లో దుమారం
గడ్కారీ ఇంట్లో నిఘాపై కాంగ్రెస్ నిరసన
చర్చకు, జేపీసీ విచారణకు డిమాండ్
అవసరం లేదన్న కేంద్ర హోంమంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ నివాసంలో బగ్గింగ్(నిఘా) చేసినట్లు వచ్చిన ఆరోపణలపై బుధవారం పార్లమెంట్‌లో దుమారం రేగింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గుజరాత్‌లో మంత్రులు, ఎంపీలపై నిఘా కోసం అనుసరించిన విధానాలను కేంద్రంలోనూ అవలంబిస్తున్నారని మండిపడింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం అవన్నీ నిరాధారాలని, అలాంటి తప్పుడు కథనాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని లోక్‌సభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. గుజరాత్ టెలిఫోన్ కంపెనీలు దాదాపు 29 వేల మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆయన ఆరోపించారు. గడ్కారీ నివాసంలో కొన్ని రహస్య పరికరాలు లభించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత మంది మంత్రులు, ఎంపీలపై నిఘా పెట్టారో ప్రధాని తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో గడ్కారీ కూడా లోక్‌సభలోనే ఉన్నారు. కాగా, ఇదే అంశంపై రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.
‘377రూల్’ ప్రస్తావనలు తిరిగి ప్రారంభం
సత్వరం పరిష్కరించవలసిన ప్రజా ప్రాముఖ్యంగల సమస్యలను సభ్యులు ప్రత్యేక ప్రస్తావన ద్వారా లేవనెత్తేందుకు అనుమతించే ప్రక్రియను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరిగి ప్రారంభించారు.16వ లోక్‌సభలో తొలిసారి ఎన్నికైన సభ్యులు రికార్డు స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆమె బుధవారం ఈ చొరవతీసుకున్నారు. దీనివల్ల సభ్యులు తమ నియోజకవర్గాల చెందిన సమస్యలను సభలో సత్వరం ప్రస్తావించేందుకు వీలుంటుందని స్పీకర్ పేర్కొన్నారు. లోక్‌సభలో విపక్షనేత పదవిని ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అటార్నీ జనరల్ రాసిన లేఖ, ఇతర నిబంధనలను పరిశీలించాక నాలుగు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. విపక్షనేతను నిర్ణయించే విషయంలో స్పీకర్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి ఇష్టాయిష్టాలు ఉండవని, కేవలం నియమ నిబంధనలు, సంప్రదాయాలను బట్టే నడచుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
వాగ్దానాలు నెరవేర్చాలి: సుబ్బిరామి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో యూపీఏ ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు.
పార్లమెంటు ఆవరణలో కారు కలకలం!
పార్లమెంటు భవనం గేటు వద్ద బుధవారం ఓ కారు బూమ్ బ్యారియర్(రైల్వే గేటులా అడ్డుగా ఉంచేది)ను ఢీకొట్టి లోపలికి దూసుకురావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అలారం మోగించాయి. కమెండోలు ఓ జిప్సీలో గేటు వద్దకు చేరుకున్నారు. జర్నలిస్టులు కూడా ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఉరుకులుపరుగులు పెట్టారు. అయితే.. ఓ ఎంపీ కారు పొరపాటున బూమ్ బ్యారియర్‌ను ఢీకొట్టిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదంటూ ఓ భద్రతాధికారి కొద్దిసేపటికి ప్రకటించారు. దీంతో కలకలం సద్దుమణిగింది. 2001లో ఐదుగురు ఉగ్రవాదులు అంబాసిడర్ కారులో దూసుకొచ్చి దాడిచేసిన గేటు వద్దే తాజాగా కారు దూసుకురావడంతో ఒక్కసారిగా ఆందోళనలు పెరిగిపోయాయి.