- హస్తినలో చంద్రబాబుకు దక్కని భరోసా!
- కాపాడాలని ప్రధాని తదితరులను కోరిన ముఖ్యమంత్రి
- ఫోన్ల ట్యాపింగ్‌పై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు ఆశించిన భరోసా ఢిల్లీ పెద్దల నుంచి లభించలేదని తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టెలిఫోన్ సంభాషణ ఆడియో టేపులు బయటపడిన నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు బుధవారం వరుసగా కేంద్రంలోని కీలక నేతలందరినీ కలిశారు. అయితే పలు అంశాలకు సంబంధించి ఆయన చేసుకున్న విన్నపాలకు కేంద్రంలోని భాగస్వామ్య ప్రభుత్వం నుంచి ఆశించిన భరోసా లభించలేదని చెబుతున్నారు.
బుధవారం ఉదయం కేబినెట్ సమావేశం ఉండడంతో మధ్యాహ్నం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలను సీఎం కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యతో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు భేటీ అయ్యారు. ఓటుకు నోటు పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అనంతరం కొరియా ప్రతినిధులతో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఒక ప్రైవేటు హోటల్లో సమావేశమైన బాబు.. ఆ తర్వాత పార్టీలోని కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడులతో సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఎలాంటి ఒత్తిళ్లు తేవాలి? ఏయే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి? తదితర అంశాలపై చర్చించారు. సాయంత్రం 4.15కు ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్న చంద్రబాబు దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఓటుకు నోటు సంబంధిత సంఘటనలను సుదీర్ఘంగా వివరించినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు పూర్తిస్థాయిలో అప్పగించాలని కోరారు. అలాగే తమ ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి పరికరాలు తెప్పించారని తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 అమలుపై, ట్యాపింగ్‌పై పరిశీలిస్తామన్న ప్రధానమంత్రి.. బాబును కేసు నుంచి బయటపడేసే అంశంపై మాత్రం మౌనం వహించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానమంత్రి నివాసం నుంచి బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు గంభీర వదనంతో కనిపించారు. ఉదయం నుంచీ తీవ్ర ఒత్తిడిలో కనిపించిన బాబు.. రాత్రి వరకు ఆందోళనతోనే కనిపించారు. రాత్రి 9 గంటలకు ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశం సందర్భంగా.. మీడియా ప్రశ్నలకు అసహనంతో, ఆగ్రహంగా బదులిచ్చారు.
టీడీపీ నేతల్లో టెన్షన్: చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో టీడీపీ నేతలంతా టెన్షన్‌లో కనిపించారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కలిసిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ప్రధాని ఎలా ప్రతిస్పందించారు? పరిస్థితి ఏమిటని ఇక్కడి నేతలు ఢిల్లీలోని పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆరా తీశారు.
కేంద్రం మౌనం..!
Published Thu, Jun 11 2015 3:12 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement