ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రావత్
న్యూఢిల్లీ: ఇన్నాళ్లుగా పాకిస్తాన్ సరిహద్దుపై పెడుతున్న దృష్టిని ఇకపై చైనా సరిహద్దుపైకి మరల్చాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. పొరుగుదేశాలను మంచి చేసుకుని భారత్‌కు ఇబ్బందులు సృష్టించేందుకు చైనా పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాల్సి ఉందన్నారు. పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా దూకుడుగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్మీడే సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘చాలా కాలంగా భారత ప్రభుత్వం పశ్చిమ సరిహద్దులపై దృష్టిపెడుతూ వస్తోంది. ఇప్పుడు ఉత్తరాన ఉన్న చైనా సరిహద్దుపైనా దృష్టి సారించాలి. ఉత్తర ప్రాంతంలో మౌలికవసతుల కల్పన వేగం పెంచాలి. మిలటరీ పరంగా చైనానుంచి ఏనాటికైనా ముప్పు ఉంటుంది. దీనికి దీటైన సమధానమిస్తాం’ అని అన్నారు.
ఆ దేశాలకు హృదయపూర్వక మద్దతు
‘నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టాలి. ఈ దేశాలు భారత్‌నుంచి దూరంగా వెళ్లేందుకు మనం అనుమతించకూడదు’ అని అన్నారు.
డోక్లాంలో చైనా బలగాల మోహరింపు
ఉత్తర డోక్లాంలో చైనా సైన్యాన్ని మోహరిస్తోందని ఆయన తెలిపారు. శీతాకాలం తర్వాత చైనా మిగిలిన సరిహద్దు కేంద్రాల్లోనూ బలగాలను మోహరించే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భారత బలగాలు వ్యవహరిస్తాయన్నారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు డ్రాగన్ దే శం ప్రయత్నిస్తే సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తి భారత ఆర్మీకి ఉందని పునరుద్ఘాటించారు.
మదర్సాలు, మసీదులపై నియంత్రణ
కశ్మీర్‌లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భారీమార్పులు తీసుకురావటంతోపాటు.. మసీదులు, మదర్సాలపై స్వల్ప నియంత్రణ అవసరమన్నారు.
మరికొన్ని వివరాలు..
► ఉగ్రవాద పోరులో అమరులైన వారి పిల్లల కోసం రెండు పాఠశాలల ఏర్పాటు. 3,4 ఏళ్లలో అమల్లోకి తెస్తాం.
► త్వరలోనే భారత, చైనా అధికారుల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)లు మాట్లాడుకునేందుకు హాట్‌లైన్ ఏర్పాటు.
► ప్రభుత్వం అనుమతిస్తే.. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులున్నాయంటూ చేస్తున్న బుకాయింపునకు సరైన సమాధానమిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment