
అత్యాచారయత్నం చేశాడని...
తనకు జరిగిన అవమానంతో కుంగిపోయిన ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
కాన్పూర్: తనకు జరిగిన అవమానంతో కుంగిపోయిన ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. తనపై జరిగిన అత్యాచారయత్నంతో నాలుగు గోడల మధ్య కుమిలిపోయిన ఆమె చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా సుతాన్ పర్వా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఈ నెల 9న ఆమెపై శివమ్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అప్పటినుంచి ఇంట్లోనే ఉండిపోయిన ఆమె బుధవారం సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాలేజీకి వెళ్లొచ్చేటప్పుడు బాలికను శివమ్ వేధించేవాడని కాన్పూర్ ఎస్పీ పుష్పాంజలి మాథూర్ తెలిపారు. అతడి గురించి బాలిక తన తల్లిదండ్రులతో చెప్పినప్పటికీ అవమానాలకు గురికావాల్సి వస్తుందేమోనన్న భయంతో వారు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన శివమ్ పై కేసు నమోదు చేశామని చెప్పారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.