ముఖ్యమంత్రి కుర్చీ ఇక భద్రం
ఇదిగో మారుస్తారు.. అదిగో మారుస్తారు అని చెబుతూ వస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.. ఇక బేఫికర్గా ఉండొచ్చు. ఆయన యథాతథంగా కొనసాగుతారని, ముఖ్యమంత్రి పదవిలో మార్పు ఏమీ లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మోహన్ ప్రకాష్ తెలిపారు. పృథ్వీరాజ్ నిస్సందేహంగా తన పదవిలో కొనసాగుతారని అన్నారు.
అంతకు ముందు పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పడతారనే ఊహాగానాలు దాదాపు రెండు మూడు వారాల నుంచి అటు మహారాష్ట్రతో పాటు ఇటు ఢిల్లీల్లో కూడా జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు మరోసారి గుప్పుమన్నాయి. అయితే 48 గంటలు గడవకుండానే మళ్లీ ఆయన పదవి సేఫ్ అని చెప్పారు.
అధిష్ఠానం పిలుపుతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున చవాన్కు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఒక దశలో భావించింది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిండే, నారాయణ రాణే, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయంతో మరోసారి వారందరికీ ఆశాభంగం కలిగింది.