కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎంను మారుస్తుందా?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పట్టనున్నారా? మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ మేరకు ఊహాగానాలు జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు గుప్పుమన్నాయి.
ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి హుటాహుటిన పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బవాన్ ను ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నేతృత్వం భావిస్తోంది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిందే, నారాయణ రాణే, రాధాకృస్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చవాన్ ను తొలగించాలని ఎన్సీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.