
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ సోమవారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చిస్తారని వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు పలు రంగాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. హాట్‌స్పాట్లు కాని నివాస ప్రాంతాల్లోనూ మినహాయింపులూ ప్రకటించాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మరి కొన్నాళ్లు కొనసాగించడమే మేలని పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. మార్చి 20, ఏప్రిల్ 11 తేదీల్లోనూ ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.