
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. దేశంలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం అంశమే ప్రధానంగా చర్చ సాగనుంది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపైనే వీరు దృష్టి సారించనున్నారు.
ఈ సందర్భంగా లాక్‌డౌన్ ఆంక్షలపై మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని మోదీ, సీఎంలతో చర్చ జరిగిన సమయంలో దేశంలో కోవిడ్ కేసులు 28వేల వరకు ఉండగా ప్రస్తుతం అది 63 వేల వరకు చేరుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపే ఐదో సమావేశం ఇది. మార్చి 25వ తేదీన మొదటిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన కేంద్రం..మూడోసారి ఈ నెల 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తూ..ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు సడలింపులు చేపట్టింది.