న్యూఢిల్లీ: పని సంస్కృతిలో, వృత్తి, ఉద్యోగ వాతావరణంలో ‘కరోనా’ గణనీయ మార్పు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇల్లే ఆఫీస్‌గా మారిందని, ఇంటర్నెటే మీటింగ్ రూమ్‌గా రూపాంతరం చెందిందని, ఆఫీస్‌లో సహోద్యోగులతో కలిసి బ్రేక్ టైమ్ గడపడం చరిత్రగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘లింక్డ్‌ఇన్’ పోర్టల్‌కు తాను రాసిన ఒక వ్యాసాన్ని ఆదివారం మోదీ ట్వీట్ చేశారు. సృజనాత్మక, శక్తిమంతమైన భారతీయ యువత ఆరోగ్య, సౌభాగ్య భవిష్యత్తుకు మార్గాన్ని ప్రపంచానికి చూపగలరన్నది తన విశ్వాసమని, అందుకు సంబంధించిన కొన్ని ఆలోచనలను పంచుకున్నానని పేర్కొంటూ ‘లైఫ్ ఇన్ ద ఎరా ఆఫ్ కోవిడ్–19’ పేరుతో రాసిన ఆ వ్యాసం లింక్‌ను ప్రధాని ట్వీట్ చేశారు.
ఏ ఈ ఐ ఓ యూ
‘ఈ శతాబ్దంలోని మూడో దశాబ్దం అనేక ఒడిదుడుకులతో ప్రారంభమైంది. కోవిడ్–19 తనతో పాటు ఎన్నో అవాంతరాలను తీసుకువచ్చింది’ అని ఆ వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాపార నమూనాలు తెరపైకి వస్తున్నాయన్న ప్రధాని.. ఈ సంక్షోభ సమయాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా అనంతర ప్రపంచంలో నూతన వ్యాపార అభివృద్ధి అవకాశాలను రూపొందించుకోవాలని సూచించారు.
‘పరిస్థితులకు తగ్గట్లుగా మార్పు చెందుతూ, అంతర్జాతీయ పరిణామాలను ఆకళింపు చేసుకుంటూ, సామరŠాధ్యలను పెంపొందించుకుంటూ, అవకాశాలను సృష్టించుకుంటూ, సమ్మిళిత దృక్పథంతో ముందుకు సాగాలి’ అని ఇంగ్లీష్ భాషలోని అచ్చులు ఏ(అడాప్టబిలిటీ), ఈ(ఎఫిషియెన్సీ), ఐ(ఇన్‌క్లూజివిటీ), ఓ(అపార్చునిటీ), యూ(యూనివర్సలిజం)లను సమయోచితంగా ఉపయోగిస్తూ దిశానిర్దేశం చేశారు. కరోనా అనంతర ప్రపంచంలో ఈ ఐదు అంశాలు ఏ వ్యాపార నమూనాకైనా ముఖ్యమైన అంతర్భాగాలవుతాయన్నారు.
కరోనాకు కులం, మతం లేదు
కరోనా కులం, మతం, జాతి, వర్గం, వర్ణం, భాష.. ఇవేమీ చూడదని ప్రధాని పేర్కొన్నారు. వీటికి అతీతంగా దాడి చేస్తుందన్నారు. కరోనాపై పోరాటంలో అందరు కూడా సోదర భావంతో ఐక్యంగా సాగాలన్నారు. ‘గతంలో దేశాలు, ప్రాంతాలు పోరాడుకున్నాయి. ఇప్పుడు మానవాళి అంతా ఒక ఉమ్మడి శత్రువుపై పోరాడుతోంది. ఎంత ఐక్యంగా పోరాడామన్న విషయంపైననే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని తెలిపారు.
నేనూ మారాను
కరోనా కారణంగా మారిన పరిస్థితులకు అనుకూలంగా తాను కూడా మార్పు చెందానని ప్రధాని పేర్కొన్నారు. ‘ఇప్పుడు మంత్రివర్గ సహచరులతో, అధికారులతో, ప్రపంచ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశమవుతున్నా’నన్నారు. ‘సులభంగా ఆచరించదగిన వ్యాపార, జీవనవిధాన నమూనాల గురించి ఆలోచించాల్సిన తరుణమిది’ అన్నారు. కొత్త పని సంస్కృతిని రూపొందించే కార్యక్రమానికి యువ భారత్ నడుం బిగించి, నాయకత్వం వహించాలని ప్రధాని కోరారు. అన్ని శక్తిసామర్థ్యాలున్న భారత్.. కరోనా అనంతర బహుళ వ్యాపార ప్రపంచంలో కీలక శక్తిగా ఎదగగలదన్నారు. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని, ఎదుగుదామని పిలుపునిచ్చారు. ‘ఆధునిక సాంకేతికతతో ముందుగా లాభపడేది పేదలే. సాంకేతికత వల్ల దళారులు అంతమయ్యారు.
సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయి’ అని వివరించారు. కరోనాపై పోరాటాన్ని కూడా మన సినిమా తారలు, క్రీడాకారులు, సంగీతకారులు టెక్నాలజీ సాయంతో అత్యంత సృజనాత్మకంగా చేపట్టారని ప్రధాని గుర్తు చేశారు. డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడటం మన మార్పును ఆహ్వానించే తత్వానికి మంచి ఉదాహరణ అని గుర్తు చేశారు. టెలీమెడిసిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఆఫీస్‌లో ఎంతసేపు ఉన్నామనే విషయం కన్నా.. ఉత్పాదకత, సామర్ధ్యం కీలకమన్నారు. చవకైన వైద్య పరిష్కారాలను, భారీ ఎత్తున సృష్టించాల్సిన అవసరాన్ని కరోనా కలిగించిందన్నారు. రైతులకు అవసరమైన సమాచారం, వినియోగదారులకు నిత్యావసరాలు అందేలా సాంకేతికత సాయంతో సృజనాత్మక మార్గాలను వెతకాలని కోరారు.
కిరాణా వర్తకులకు థాంక్స్
లాక్‌డౌన్ కాలంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్న చిన్న వ్యాపారస్తులు, కిరాణా వర్తకులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రాణాలకు తెగించి వారే ఈ సేవలను అందివ్వనట్లయితే.. పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. చిన్న వర్తకుల ఈ సేవను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది’ అని పీఎం వరుస ట్వీట్స్ చేశారు. ‘ఎన్నో వర్గాల ప్రజలు సానుకూలంగా సేవలందించడం వల్లనే లాక్‌డౌన్‌ను ఆచరించగలుగుతున్నారు’ అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని క్రిషన్ కుంజ్ మురికివాడలో బిక్కుబిక్కుమంటున్న జనం
Comments
Please login to add a commentAdd a comment