
కమల్‌పై పటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ కంప్లైంట్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సినీనటుడు మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. కమల్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీశారని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది.
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అరవకురిచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది.
మరోవైపు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సోమవారం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి నివేదించింది. కాగా, చెన్నైలోని కమల్ హాసన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.