
తిరువనంతపురం : లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించడం సరైనది కాదని కేంద్రానికి సూచించారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయమని విజయన్ అభిప్రాయపడ్డారు. కాగా 13 దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను 64 ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి విజయన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. (విదేశాల నుంచి స్వదేశానికి : టికెట్లు ధరలు ఇవే
‘విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావాలన్న కేంద్రం నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనది కాదు. వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా భారత్‌కు తీసుకురావడం చాలా ప్రమాదకరం. ఒక్కో విమానంలో 200 మందికి పైగా ప్రయాణికులు ఉంటారు. వారిలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా.. మిగతావారంతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయా దేశాల్లో వైరస్ ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వారిని భారత్‌కు తరలిస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. భారతీయుల తరలింపుకు కేంద్రం మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. (లాక్‌డౌన్: 14,800 మంది భారత్‌కు)