
బెంగళూరు : ‘నేను మీ ఊరికి చెందిన హుచ్చేగౌడ కుటుంబం కోడలిని, అంబరీశ్ ధర్మపత్నిని, అభిషేక్‌కు తల్లిని. మండ్య జిల్లా మహిళగా జిల్లాకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి సుమలత అనే నేను మండ్య గౌడను కాదా’అని సుమలత అంబరీశ్ ప్రశ్నించారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బుధవారం నామినేషన్ సమర్పించారు. అనంతరం బహిరంగ సభలో ఆవేశంగా ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. ‘అంబరీశ్ మరణం అనంతరం నాలుగు నెలలు ఇంటికే పరిమితమయ్యా. అంబరీశ్ మృతితో కలత చెందిన నాకు అభిమానులు ముఖ్యంగా మండ్య జిల్లా ప్రజలు కొండంత ధైర్యన్నిచ్చారు.
ఇంతమంది అభిమానులు, నేతలు, కార్యకర్తల ప్రేమాభిమానాలు కాదనలేక కేవలం వారి కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్నా. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. చివరి క్షణం వరకు అంబరీశ్ కాంగ్రెస్ నేతగానే ఉన్నారు. ఆ కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ తలుపు తట్టాం. అయితే పొత్తు నెపంతో కాంగ్రెస్ టికెట్ తిరస్కరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నా’ అని ప్రకటించారు.
దర్శన్, యశ్‌లు మా ఇంటి పిల్లలు
శాండల్‌ఉడ్ హీరోలైన దర్శన్,యశ్‌లతో తమకు చాలా కాలంగా అనుబంధం ఉందని ఇద్దరు హీరోలు మా ఇంటి పిల్లలని సుమలత అన్నారు. వారిద్దరూ తమను తల్లితండ్రుల్లా భావిస్తారని ఈ ఉద్దేశంతోనే దర్శన్,యశ్‌లు తమ తరపున ప్రచారం చేయడానికి ఆసక్తి చూపారని, అందులో తప్పేంటని ప్రశ్నించారు.తమ తరపున ప్రచారం చేయడానికి ముందుకు వచ్చిన దర్శన్,యశ్‌లపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుండడం తమను ఎంతగానో బాధిస్తోందన్నారు. తమకు అధికార దాహం లేదని ఒకవేళ అధికారమే పరమావధిగా పెట్టుకొని ఉంటే ఎమ్మెల్యే,మంత్రి పదవికి అంగీకరించేవాళ్లమని సుమలత అన్నారు.
విమర్శలకు భయపడం: యశ్, దర్శన్
తమపై వస్తున్న విమర్శలు,బెదిరింపుల గురించి తాము పట్టించుకోమంటూ హీరో యశ్ తెలిపారు. మేమేమి పాకిస్తాన్ నుంచి రాలేదు, ఇక్కడే పుట్టాం, కావేరి నది నీళ్లు తాగి పెరిగామని అన్నారు. అంబరీశ్ ఇంటి పిల్లలుగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నామని, అటువంటిది సుమలత అంబరీశ్ తరపున ప్రచారం చేయడం తమ కర్తవ్యమన్నారు. మండ్య జిల్లా ప్రజల గురించి, కన్నడ చిత్ర పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు.. విమర్శలకు భయపడబోమని, ఎన్ని విమర్శలు,బెదిరింపులు వచ్చిన తగ్గేది లేదంటే హీరో దర్శన్ స్పష్టం చేశారు.
ఎందుకమ్మా రాజకీయాలు అన్నా: అభిషేక్
జిల్లా ప్రజలపై ప్రేమతో తల్లి సుమలత ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారని తనయుడు అభిషేక్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళితే ప్రత్యర్థుల దూషణలను అవసరమా అంటూ తమ తల్లిని ప్రశ్నించానన్నారు. అయితే ఇన్నేళ్ల పాటు మన కుటుంబాన్ని ఆదరించిన అభిమానులు, మండ్య జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తనతో చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటైంది.
చాముండేశ్వరికి పూజలు
మైసూరు : లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి సు మలత అంబరీశ్ బుధవారం నామినేషన్‌కు ముందు చాముండిబెట్టపైనున్న చాముండేశ్వరిదేవి ముందు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అంబరీశ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి నామినేషన్ పత్రాలను అమ్మవారి ముందుంచి పూజలు నిర్వహించేవారని తెలిపారు. తానూ అదే విధంగా పూజలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల గురించి తమకు ఏమాత్రం భయం లేదని నాకు తోడుగా అభిమానులు,మండ్య జిల్లా ప్రజలు ఉన్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment