పోటీ చేస్తే.. అక్కడి నుంచే: సుమలత అంబరీశ్‌ | I Will Contest From Mandya Says Sumalatha | Sakshi
Sakshi News home page

పోటీ చేస్తే.. అక్కడి నుంచే: సుమలత అంబరీశ్‌

Published Mon, Feb 11 2019 10:05 AM | Last Updated on Mon, Feb 11 2019 10:10 AM

I Will Contest From Mandya Says Sumalatha - Sakshi

రాజకీయాల్లోకి వస్తారా?, రారా?, ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా? అయితే ఎక్కడి నుంచి? ఇలా తలెత్తిన అనేక ప్రశ్నలకు సుమలత అంబరీశ్‌ సమాధానం ఇచ్చారు. తమ రాజకీయ ప్రవేశం మండ్య నుంచే కాంగ్రెస్‌ పార్టీ నుంచి జరుగుతుందని ఆమె తేటతెల్లం చేశారు. దీంతో మండ్య రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశముంది.   

బెంగళూరు: సమయం వస్తే మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సుమలత అంబరీశ్‌ తెలిపారు. ఆదివారం కుమారుడు అభిషేక్‌తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామి కి పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబరీశ్‌ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు. అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు.  

తల్లి నిర్ణయానికి అభిషేక్‌ మద్దతు  
తాను నటించిన కొత్త చిత్రం అమర్‌ టీజర్‌ను ఈ నెల 14న విడుదల కానున్నట్లు సుమలత అంబరీశ్‌ కుమారుడు అభిషేక్‌ తెలిపారు. మొదటి చిత్రం అమర్‌తో పాటు మున్ముందు నటించే ప్రతీ చిత్రంలో కూడా తమ తండ్రి అంబరీశ్‌ తప్పకుండా ఉంటారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని తల్లి సుమలత తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని రాజకీయాల్లో మాత్రమే కాకుండా తమ చిత్రాల విషయంలో కూడా తల్లి సుమలత నిర్ణయాలు,ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement