న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్‌సహా మరో ఇద్దరికి స్థానిక న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరుచేసింది. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, యోగేంద్రయాదవ్‌లు వ్యక్తిగత బాండ్‌లు ఇవ్వడంతో మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి మునీష్‌గార్గ్ వారిని విడుదల చేశారు. అడ్వొకేట్ రిషికేశ్ కుమార్‌ద్వారా ఒక్కొక్కరు రూ. 10 వేల చొప్పున ముగ్గురూ వ్యక్తిగత బాండ్లను కోర్టుకు సమర్పించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 16వ తేదీకి వాయిదావేసింది.
కాగా అడ్వొకేట్ సురేందర్‌కుమార్ శర్మ ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500, 34 సెక్షన్ల కింద ఈ ముగ్గురిపై పోలీసులు పరువునష్టం దావా వేసిన సంగతి విదితమే. అంతకముందు ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితులను కోర్టుకు రప్పించేం దుకు ప్రాసిక్యూషన్ వద్ద తగు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా వీరు చేసిన వ్యాఖ్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయని, అవి పిటిషనర్ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పేర్కొంది. అయితే ఆప్ నాయకులు తనను వంచించేందుకు యత్నించారంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. అందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలేమీ లేవని పేర్కొంది.