ముజఫర్‌నగర్ : బంగ్లాదేశ్, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకాలాపాలు నిర్వహించే వారికి భారత పాస్‌పోర్టులు ఉన్నట్లు అనుమానాలు రావడంతో.. పాస్‌పోర్టులు పరిశీలనకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దియోబంద్, ముజఫర్‌నగర్, సహరన్పూర్ జిల్లాల్లోని వేల పాస్‌పోర్టులను ధృవీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
బంగ్లాదేశ్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరివద్ద భారత పాస్‌పోర్టులు.. దియోబంద్ అడ్రస్‌తో లభించడంతో.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు.. పదుల సంఖ్యలో దియోబంద్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దియోబంద్‌లోనే.. ప్రముఖ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఉండడం గమనార్హం.
బంగ్లాదేశీ అనుమానాస్పద ఉగ్రవాదులు అరెస్టయిన నేపథ్యంలో.. అక్రమంగా దియోబంద్‌లో నివసిస్తున్న బంగ్లా జాతీయులపై తక్షణం చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బంగ్లాజాతీయులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అనేది.. దియోబంద్ లేదా మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న అంశం కాదని షమారాన్పూర్ డీఐజీ ఎమ్మాన్యువల్ తెలిపారు. పాస్‌పోర్టులు ఉన్నవారంతా.. దియోబంద్, ముజఫర్‌నగర్, సహారాన్పూర్‌లలో తప్పకుండా వెరిఫికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్, సహారాన్పూర్, దియోబంద్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉండడంతోనే విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలోనూ సహారాన్పూర్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలతో ఉన్నవ్యక్తులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన బంగ్లాదేశీ ఉగ్రవాదుల వద్దనున్న భారతీయ పాస్‌పోర్టులను చూపించారు. ఇదిలా ఉండగా 20 మంది బంగ్లాదేశ్ జాతీయులు పశ్చిమ యూపీలో అదృశ్యమైన విషయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment