
ఎలా ఉండాలో ఆయన్నే చెప్పమనండి! : దిగ్విజయ్‌సింగ్
విభజన తీరు బాగాలేదన్న చంద్రబాబుపై దిగ్విజయ్ వ్యంగ్యాస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తీరు సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘విభజన తీరు సరిగా లేకుంటే ఎలా ఉండాలో ఆయన్నే చెప్పమనండి’ అంటూ వ్యాఖ్యానించారు. విభజన తీరుపై ఆయన చెబితేనే బాగుంటుందని వ్యంగంగా పేర్కొన్నారు. విభజనపై అన్ని పార్టీలను సంప్రదించామని, టీడీపీ సహా దాదాపు అన్ని పార్టీలు పలు సందర్భాల్లో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని వివరించారు. ఇప్పుడు ఆ పార్టీలు వైఖరులు మార్చుకుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఉదయం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, బంద్‌లను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాహితం కోరి ఉద్యోగులు దీన్ని అర్ధం చేసుకోవాలి.
ఉద్యోగులు ఓ వైపు వేతనాలు కోల్పోతున్నారు. మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు. అక్కడ విద్యుత్ కూడా లేదు. ఉత్పతి అవుతుంది కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. అందువల్ల వారు త్వరగా ఆందోళనను విరమించాలి’ అన్నారు. సమ్మెను విరమించి తమ సమస్యలను మంత్రుల బృందానికి తెలియజేయాలని సూచించారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం ఎదుర్కొనే అన్ని సమస్యలపై మంత్రుల బృందం స్పందిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజల భద్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తామని దిగ్విజయ్ వెల్లడించారు. సీమాంధ్రుల అభ్యంతరాలను పరిశీలించేందుకు ఆంటోనీ కమిటీని, మంత్రుల బృందాన్ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఆంటోనీ కమిటీ ముందు అన్ని పక్షాలు వాదనలు వినిపించాయన్నారు. ఆంటోనీ కమిటీ తుది నివేదికను కాంగ్రెస్ అధ్యక్షురాలి ద్వారా మంత్రుల బృందానికి సమర్పిస్తామన్నారు.