ఫైల్ ఫోటో
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ భయపెట్టినా ప్రేమకు అడ్డులేదని ఒక జంట నిరూపించింది. కరోనా వైరస్ ఉందా లేదా అన్న నిర్ధారణ చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న యువకుడు తన ప్రేయసి కోసం అక్కడి నుంచి పరారై ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం మేరకు.. శివగంగైకు చెందిన విజయ్ విదేశాల్లో ఉంటున్నాడు. అతను మదురైకి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. విదేశాల నుంచి రాగానే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ యువతి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. అయితే ఆ యువతికి వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. (మహమ్మారి కోరల్లో 724 మంది)
ఈ విషయం తెలుసుకున్న యువకుడు తన ప్రేయసిని దక్కించుకునేందుకు విదేశాల నుంచి మదురై వచ్చాడు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ రూపంలో వైద్యాధికారులకు చిక్కాడు. అతన్ని వైద్యులు మదురైలోని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచారు. కరోనా నిర్ధారణ నిమిత్తం అతని రక్త నమూనాలను పరిశోధనకు పంపించారు. ఈ సమయంలో తన ప్రేయసిని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్న విజయ్ గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి తప్పించుకుని తిరుపరంగుండ్రంలో ఉన్న ప్రేయసిని చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. (ఆరోగ్యం... క్యూబా భాగ్యం!)
ఆస్పత్రిలో ఉన్న విజయ్ కనిపించకుండా పోవడంతో శుక్రవారం ఉదయాన్నే అధికారుల్లో ఆందోళన నెలకొంది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. చివరకు శివగంగైకు వెళ్లేందుకు విజయ్ ప్రయత్నాల్లో ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి ప్రియురాలిని సైతం కరోనా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో విజయ్ తల్లి, సోదరుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment