లీటరు పెట్రోలుకు 25 రూపాయలే...
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆ పాపం తమది కాదని అంతర్జాతీయ మార్కెట్‌దని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పడం, అవును కాబోలు! అనుకొని వినియోగదారులు తలాడించడం తరచుగా జరిగేదే. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేందుకు, తగ్గించేందుకు భారతీయ చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పుకోవడమూ షరా మామూలే. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే అంతకన్నా ఎక్కువ ధర ఎందుకు పెరుగుతుంది? తగ్గినప్పుడు ఎందుకు తక్కువ తగ్గుతుందన్న విషయాల్లోకి లోతుగా వెళ్లం, వెళ్లినా ప్రభుత్వం తీరే అంతా! అని సరిపెట్టుకుంటాం.
ప్రస్తుతం పెట్రోలు ఉత్పత్తి రేటుకన్నా దేశీయ మార్కెట్‌లో లభిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు రెట్టింపు, అంటే వంద శాతం ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. ఢిల్లీ నగరాన్ని ప్రమాణికంగా తీసుకుంటే ఇక్కడ లీటరు పెట్రోలును 60.70 రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్టోబర్ చివరివారం లెక్కల ప్రకారం లీటరు పెట్రోలు ఉత్పత్తి చేయడానికి ఆయిల్ రిఫైనరీస్‌కు అక్షరాల 24.75 రూపాయలు ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చులను, లాభాలను లెక్కేసుకొని ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పంపులకు 27.24 రూపాయలకు లీటరు చొప్పున విక్రయిస్తున్నాయి. దానిపై డీలర్ కమిషన్ లీటరుకు 2.26 రూపాయలు. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 19.06 రూపాయలు, వ్యాట్, రాష్ట్రం విధించే అమ్మకం పన్ను కలిపితే మరో 12.14 రూపాయలు. మొత్తంగా కలిపి వినియోగదారుడికి వచ్చేసరికి లీటరుకు 60.70 రూపాయలు పడుతోంది.
అలాగే, ఢిల్లీలోని పెట్రోలు పంపులో లీటరు డీజిల్ ధర 45.93 రూపాయలు. చమురు కంపెనీలకు ఖర్చయ్యేది కేవలం లీటరుకు 24.86 రూపాయలే. కొంత మార్జిన్‌ను కలుపుకొని పెట్రోలు పంపులకు విక్రయిస్తాయి. దీనిపై డీలర్ కమిషన్ 1.43 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం 10.66 రూపాయలు. వ్యాట్, అమ్మకం పన్ను కలుపుకుంటే మరో 6.79 రూపాయలు. మొత్తం కలపి వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి లీటరుకు 45.93 రూపాయలు అయింది. నవంబర్ 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరు పెట్రోలుపై 1.60 రూపాయలు, డీజిల్‌పై 40 పైసలు పెంచిన విషయం తెల్సిందే. వాటిని కలిపితే మరింత పెరుగుతోంది.
అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం వల్ల అక్కడ వినియోగదారుడికి కారుచౌకగా పెట్రోలు లభిస్తుంది. అమెరికాలో ఏ ప్రభుత్వమైనా పెట్రోలుపై పన్నులు పెంచితే ఆ ప్రభుత్వం పడిపోతుంది. భారత్‌లాంటి దేశంలో ఆ పరిస్థితులు ఎప్పుడొస్తాయో!