‘కొలీజియం’తో పారదర్శకతకు పాతర
న్యాయ వ్యవస్థ తీరుపై సర్కారు, విపక్షాల విమర్శలు
సుప్రీం, హైకోర్టు జడ్జిల నియామకంలో పారదర్శకత లేదు: సిబల్
జడ్జిల బంధువులుహైకోర్టులో ప్రాక్టీసు చేయడం బాధాకరం
{పభుత్వ విధానాల్లో కోర్టుల జోక్యం ఏమిటి: అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పించాయి. కోర్టులపై తమకు అపార గౌరవం ఉందంటూనే న్యాయ వ్యస్థలో లోపాలను ఎత్తిచూపాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిల నియామకంలో ఏమాత్రం పారదర్శకత లేదని, న్యాయ వ్యవస్థలో బంధుప్రీతి కొనసాగుతూనే ఉందని, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి. జడ్జిల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని మార్చాల్సిందేనని స్పష్టంచేశాయి. కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ ‘న్యాయ నియామకాల కమిషన్’ను తీసుకువచ్చే ఉద్దేశంతో గురువారం రాజ్యసభలో రాజ్యాంగ (120వ సవరణ) బిల్లు-2013ను న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్వతహాగా న్యాయవాది అయిన సిబల్‌తోపాటు ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ (ఈయన కూడా ప్రముఖ న్యాయవాది), వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ.. కొలీజియం విధానం, న్యాయ వ్యవస్థ పనితీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ముందుగా సిబల్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్‌కు 1993లో సుప్రీం కోర్టు సరికొత్త భాష్యం చెబుతూ కొలీజియంకు అంకురార్పణ చేసింది. ఒకవిధంగా రాజ్యాంగాన్ని తిరగరాసింది. కొలీజి యంతోన్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల మధ్య ఉన్న సున్నితమైన అధికారాల సమతూకం దెబ్బతింది’ అన్నారు.
జడ్జిని ఎలా నియమిస్తారో ఎలా తెలుస్తుంది?
ప్రభుత్వానికి, కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం ఉండాలని న్యాయవ్యవస్థ చెబుతుందని, అయితే అదే సూ త్రం న్యాయవ్యవస్థకు ఎందుకు వర్తించదని సిబల్ ప్రశ్నిం చారు. కొలీజియంలో న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత ఎక్కడుందని ప్రశ్నించారు. ‘ఒక జడ్జిని ఎలా నియమిస్తారు? మనకు తెలియదు. సమాచార చట్టం కూడా వర్తిం చదు. అలాంటప్పుడు అక్కడ పారదర్శకత ఉంటుందని ఎలా చెప్పగలం’ అని ఆయన ప్రశ్నించారు. కొలీజియం విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఇతర న్యాయమూర్తులను సంప్రదించి హైకోర్టు జడ్జిలను నియమిస్తారని, ఇది హైకోర్టుల స్వతంత్రను దెబ్బతీస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను కాపాడాలని భావించినప్పుడు సుప్రీంకోర్టు అదే విధానాన్ని హైకోర్టులకు ఎందుకు వర్తింపజేయదు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో బంధుప్రీతిని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘జడ్జిల బంధువులే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. మామ, మేనమామ లేదా మరొకరో కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇంకెన్నాళ్లు ఈ బంధుప్రీతి ఇలా కొనసాగాలి?’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో హేతుబద్ధతను కోర్టులు నిర్ణయిస్తున్నప్పుడు కోర్టుల నిర్ణయాలకు కూడా అదే వర్తిస్తుందని అని పేర్కొన్నారు.
వేరే వ్యవస్థలోకి ఎందుకు చొచ్చుకురావడం?
ప్రజాస్వామ్యంలోని ఇతర వ్యవస్థలు న్యాయ వ్యవస్థలోకి చొచ్చుకువెళ్లనప్పుడు న్యాయ వ్యవస్థ మాత్రం ఇతర వ్యవస్థలను అతిక్రమించడం ఏమిటని బీజేపీ నేత అరుణ్‌జైట్లీ ప్రశ్నించారు. మీరు అది చేయండి.. ఇది చేయండి అని కోర్టులు ప్రభుత్వాలను ఆదేశించడం, చివరికి ఆర్థిక విధానాలను కూడా నిర్దేశించడం ఏమిటని నిలదీశారు. ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధం విధిస్తూ కోర్టు వెలువరించిన ఉత్తర్వులు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని, ఒకవిధంగా కరెంటు ఖాతా లోటు పెరగడానికి, రూపాయి పతనానికి పరోక్ష కారణమయ్యాయని చెప్పారు.
న్యాయ నియామకాల సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రస్తు తం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు వెసులుబాటు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును గురువా రం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును న్యాయ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో బీజేపీ సభ్యు లు వాకౌట్ చేశారు. దీంతో ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పడగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు మాత్రమే పడటంతో ఆమోదం పొందింది. కొలీజియం వ్యవస్థను రద్దుచేసి జ్యుడీషియల్ నియామకాల కమిషన్‌ను ఏర్పాటుకు బీజేపీ మద్దతు పలికింది. అయితే, తమ వాదనను పట్టిం చుకోకపోవడంతో వాకౌట్ చేసింది. ఈ అంశంపై న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, బీజేపీ నేత అరుణ్ జైట్లీల మధ్య హోరాహోరీగా వాదన జరిగింది. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, కొలీజియం వ్యవస్థను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దుచేస్తే, అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయగలదని జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు.