
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఇండోర్ పాటల్‌పానీలో ఫామ్‌హౌస్‌లో పునీత్ అగర్వాల్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు పునీత్‌తో పాటు పలువురు లిఫ్ట్ ఎక్కగా, ప్రమదవశాత్తూ లిఫ్ట్(ఎలివేటర్) తీగ తెగిపోవడంతో ఒక్కసారిగా వంద మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. దాంతో వీరంతా కాంక్రీట్ గుంతలో పడిపోయారు. దుర్ఘటనలో పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పాలక్ (27), అల్లుడు పాల్కేశ్, మనవడు నవ్‌తో పాటు బంధువులు గౌరవ్, ఆర్యవీర్ ప్రాణాలు విడిచారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పునీత్ అగర్వాల్ భార్య నిధి అగర్వాల్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటన నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పునీత్ అగర్వాల్ దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు. పాత్ ఇండియా సంస్థ ద్వారా వంతెనలు పర్యవేక్షణ, హైవే నిర్మాణాలు, టోల్ ఫ్లాజాల నిర్మాణాలతో పాటు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమైన రహదారి ప్రాజెక్ట్‌లను చేపట్టింది.