
పుష్పకు షాక్.. శశికళకు క్లియర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు చుక్కెదురైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె మృతిపై సీబీఐతో విచారించేలా ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఇలాంటివాటితో మరోసారి పిటిషనర్లు బలవంతపెడితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేసింది. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి దిశగా అడుగులేస్తున్న ఏఐఏడీంకే వర్కింగ్ ప్రెసిడెంట్ జయ నెచ్చెలి శశికళకు ఇక ఎలాంటి చిక్కులు లేనట్లయింది.
జయలలిత చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరిగాయని, ఆమె మృతిపై పలువురికి అనుమానాలున్నాయని ఆరోపిస్తూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణ లేదా.. జ్యూడీషియల్ విచారణ జరగాలని ఆమె పిటిషన్‌లో కోరారు చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయేవరకు జరిగిన వైద్యం గురించి వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నిరాకరించాయని కూడా ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.