
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం మధ్యాహ్నాం ఓ ప్రైవేటు పాఠశాలలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. కాకపోరాలోని నర్బల్ ప్రాంతంలో ఫలాహ్-ఇ-మిలాత్ పాఠశాలలో మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా బాంబు దాడి జరగడంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.
విద్యార్థులకు పాఠం బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు సంభవించందని, చాలా మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు మీడియాకు తెలిపారు. సమచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.