ప్రతీకాత్మక చిత్రం
రోజూ సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్‌లు మన దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్య చూస్తే మన దేశంలో మొబైల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతోంది. అయితే అదే సమయంలో కంట్లో వేసే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 54 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇదేంటి సెల్‌ఫోన్లకు, చుక్కల మందుకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నారా?..స్మార్ట్ ఫోన్లే మన కళ్లలో నీళ్లను ఆవిరి చేసేస్తున్నాయి..ఐ డ్రాప్స్ కంపెనీల లాభాలు పెంచుతున్నాయి.
స్మార్ట్ ప్రపంచంలో సమస్త సమాచారం మనకు చేతికందే దూరంలోనే ఉంటుంది. కాలు కదపకుండా మనకు కావాల్సిన సమాచారం, ఇతర అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలిగింది. అయితే మన అవసరాలు తీర్చడంతో పాటు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి. అతిగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్‌లు వాడడం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 70 శాతం మంది కళ్లు పొడిబారిన సమస్యతో బాధపడుతుండగా వారిలో సగం మంది 20 నుంచి 30 మధ్య వయస్సు వారు ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటì కి అవసరమైన నీళ్లు ఉత్పత్తి కావడం లేదని ఎయిమ్స్ గతేడాది నిర్వహించిన సర్వేలో తేలింది.
పదిమందిలో ఏడుగురికి ఇదే సమస్య
కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతీ పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్ విజన్ సిండ్రోమ్’తో బాధ పడుతున్నట్లుగా వైద్యునిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది.
ఏటా పెరుగుతున్న ఐ డ్రాప్స్ బిజినెస్
కళ్లు పొడిబారిన సమస్యకు సాధారణంగా రిఫ్రెష్ టియర్స్ వాడుతుంటారు. 2014 జూలై నుంచి 2018 జూలై మధ్య ఈ రిఫ్రెష్ టియర్స్ అమ్మకాలు 73 శాతం పెరిగాయి. ఓ కంపెనీ అమ్మకాలు 4,71,000 యూనిట్ల నుంచి 8,15,700 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. మరో బ్రాండ్‌కు చెందిన అమ్మకాలు 800శాతం అమ్మకాలు పెరిగాయి. 2014లో ఆ బ్రాండ్ 82,600 యూనిట్లు అమ్మగా, 2018లో 7,45,000 యూనిట్లు అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కంటి చుక్కల మందుల విభాగంలో 284 కొత్త ఉత్పత్తులను మందుల కంపెనీలు ప్రారంభించాయి. అందులో 45 ఉత్పత్తులు అంటే 15 శాతం కేవలం కళ్లు పొడి బారిన సమస్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగిలినవి ‘ఐ’ ఇన్‌ఫెక్షన్, కంటి చూపు మందగించిన సమస్యలకు వాడే డ్రాప్స్ ఉన్నాయి.
కంటికి చేటును తెస్తున్న ‘స్మార్ట్’ డివైజ్స్
మనదేశంలో సగటున రెండు గంటల 39 నిమిషాల పాటు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు ఆరున్నర గంటల పాటు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. ప్రచురితమైన ఓ పేజీని చదవడానికి కంప్యూటర్ లేదా డిజిటల్ స్క్రీన్‌ను చూడడానికి చాలా తేడా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ పేర్కొంది. కంప్యూటర్ స్క్రీన్‌పై వెలుతురులో అక్షరాలను చదవడంలో అనేక ఇబ్బందులు ఉంటాయి..గ్లేరింగ్, రిఫ్లెక్షన్, స్క్రీన్‌ను పైకి కిందికి కదిలించడం వల్ల కూడా కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల వాడడంతో పాటు ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండడం, వాతావరణ కాలుష్యం, ముఖ సౌందర్య సామగ్రి కూడా కళ్లు పొడిబారిపోవడానికి మరో కారణంగా ఎయిమ్స్‌లోని ఆప్తమాలజీ విభాగానికి చెందిన ఓ ఫ్రొఫెసర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment