
లక్నో : ఆపిల్ ఉద్యోగి వివేక్ తివారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురి భార్య రేఖా మాలిక్ అకౌంట్‌లోకి రాత్రి రాత్రే అక్షరాలా ఐదు లక్షల రూపాయలు జమయ్యాయి. కేవలం 447 రూపాయలు మాత్రమే కలిగి ఉన్న తన అకౌంట్‌లోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాలు.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వివేక్ తివారి అనే టెకీ ప్రశాంత్ చౌధురి జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. దీంతో తన భర్తను అన్యాయంగా బలి తీసుకున్నప్రశాంత్‌కు కఠిన శిక్ష పడాలంటూ వివేక్ భార్య కల్పనా తివారి డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆత్మరక్షణ కోసమే తన భర్త కాల్పులు జరిపారని, ఆయన్ని అనవసరంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ భార్య రాఖీ మాలిక్(పోలీసు కానిస్టేబుల్) ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వీర్ సింగ్ రాజు అనే మరో యూపీ కానిస్టేబుల్(ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం) ఫేస్‌బుక్ ద్వారా ఓ క్యాంపెయిన్ ప్రారంభించాడు.
‘ఈ విషయంలో మన సోదరులకు సీనియర్ పోలీసు అధికారులు ఏమాత్రం అండగా నిలవడం లేదు. కాబట్టి ప్రశాంత్ చౌధురి, సందీప్ రానాలకు మన వంతు సాయం చేయాలి. వారికి న్యాయం జరిగేలా చూడాలి’ అంటూ రాజు ఫేస్‌బుక్‌లో ఓ పేజీ క్రియేట్ చేశాడు. ‘సాయం చేయాలనుకుంటున్న వారు ఈ అకౌంట్‌లోకి మీకు తోచినంత డబ్బు జమచేయగలరు’ అని ప్రశాంత్ భార్య అకౌంట్ నంబరును షేర్ చేశాడు. అయితే పోస్టు వైరల్‌గా మారడంతో ప్రశాంత్, సందీప్‌ల కుటుంబాలకు సాయం చేసేందుకు వేలాది మంది ముందుకొచ్చారు. ఎవరికి తోచినంత వారు సాయం చేయడం మొదలు పెట్టారు. దీంతో రేఖా మాలిక్ అకౌంట్లోకి 5 లక్షల 28 వేల రూపాయలు వచ్చి చేరాయి.
కాగా వివేక్ తివారి హత్యతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశానని యోగి వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment