
మరో రుణమాఫీ మోసం
సాక్షి, లక్నో: రుణమాఫీ ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగపడుతుందే తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలు కూడా రైతు రుణమాఫీకి హామీలు ఇచ్చాయి. తీరా అమలు చేయమని అడిగితే మాత్రం ప్రభుత్వాలు మొహం చాటేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్ కూడా చేరింది.
గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 'కృషి రిన్ మోచన్ యోజనా' పేరుతోఆ రాష్ట్ర రైతులందరికి రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సుమారు 2.5కోట్లమంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతారని ప్రకటించింది. కానీ అమలులో మాత్రం రైతుకు అన్యాయమే జరిగింది. ఒక్కక్కరికి రూ.10, రూ.215 లు రుణమాఫీ అయినట్లు సాక్షాత్తు కార్మిక సంక్షేమ శాఖా మంత్రి మన్ను కొరి సర్టిఫికేట్లు ఇచ్చారు. దీంతో రైతులు తమకు మాఫీ అయిన మొత్తాన్ని చూసుకొని అవాక్కయ్యారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్రి గ్రామానికి చెందిన శాంతి దేవకి రూ.1.55 లక్షలు ఉండగా కేవలం రూ.10.37 మాత్రమే రుణమాఫీ జరిగింది. మౌదాహా గ్రామానికి చెందిన మున్నిలాల్‌కు రూ.40 వేలు ఉండగా కేవలం రూ.215 రుణమాఫీ అయింది.
ఇలాంటి సన్నివేశాలు డజన్లకొద్ది వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిపై మంత్రి స్పందించారు. నియమావళి ప్రకారం రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. దీంతో ప్రతిపక్షాలు యోగీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. రుణమాఫీ పేరుతో ప్రజలకు వంచించాయిని దుయ్యబట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అని, రైతులను అవమానించినట్లేనని విమర్శించారు.