
పాలక్కాడ్ : కేరళలోని పాలక్కాడ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. గ్రౌండ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇండియన్ ఫుట్‌బాల్ ప్రముఖులు ఐఎమ్ విజయన్, భైచుంగ్ భూటియా అక్కడే ఉన్నారు. అయితే వారు క్షేమంగా ఉన్నట్టు కేరళ పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది డిసెంబర్ 29న ఆల్ ఇండియా సెవెన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గుండెపోటుతో మరణించిన ఆర్ ధన్‌రాజన్ కుటుంబానికి సాయం అందించేందుకు నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహించారు.
ఈ ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు పోలీసులు చెప్పారు. ఎవరు కూడా తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పాలక్కాడ్ ఎంపీ వీకే శ్రీకందన్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్యాలరీ కూలిపోవడం దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది. గాయపడినవారికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, వాలంటీర్లు సాయం అందించారు’ అని తెలిపారు.