కుటుంబ పెద్దలను ఆహారంగా పంపుతున్నారు
పిలిభిత్: ఆచారాలు, కర్మలను నమ్మి అనుసరించే జాతి వారిది. అడవి తల్లిపై ఆధారపడి సాగించే జీవితం. తల్లి నుంచి తీసుకున్న దానిలో కొంత తిరిగి ఇచ్చేయమని చెబుతుంది వారి ఆచారం. అడవి తల్లికి ఇవ్వడానికి వారి దగ్గర ఉంది ప్రాణాలే. కుటుంబానికి ఒకరు చొప్పున స్వయంగా అడవిలోకి వెళ్లి పులులకు ఆహారంగా మారుతూ ఆత్మార్పణ చేసుకుంటున్నారు.
అవును. భారత్-నేపాల్ సరిహద్దుకు చేరువలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పిలిభిత్ టైగర్వ్ రిజర్వ్‌కు చేరువలో నివసిస్తున్న గ్రామాలు ప్రజలు ఇలా ప్రాణార్పణ చేసుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2016 ఫిబ్రవరి నుంచి దాదాపు ఏడుగురు పెద్ద వయసు గల వ్యక్తులు పులులకు ఆహారంగా మారిన ఆనవాళ్లు అధికారులకు దొరికాయి.
అడవి లోపల చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన వస్తువులు కూడా దొరికాయి. ఈ సంఘటనలపై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) దర్యాప్తుకు ఆదేశించింది. పులులు మనుషులను చంపడంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన అధికారి వెల్లడించిన వివరాలు అటవీ శాఖ అధికారులను షాక్‌కు గురి చేశాయి.
అడవి చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలే స్వచ్చందంగా పులులకు ఆహారంగా మారుతున్నారని ఆయన చెప్పారు. అడవి తల్లి తమను పేదరికం నుంచి గట్టెక్కిస్తుందనే నమ్మకంతోనే కుటుంబ పెద్దలు ఒక్కొక్కరిగా ప్రాణాలు త్యాగం చేస్తున్నారని వెల్లడించారు.