'మేనకా గాంధీ నన్ను కొట్టారు'
కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనను కొట్టారని ఓ ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మేనక.. అడవుల్లో తరచూ మంటలు చెలరేగడంపై ఫారెస్టు అధికారుల్ని నిలదీశారు. స్థానిక రైతులు గోధుమ పంటల్ని తగలబెట్టడం వల్లే మంటలు అడవులకు వ్యాపిస్తున్నాయని చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న 57 ఏళ్ల కాపలాదారు రాంగోపాల్ వర్మ మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను మాట్లాడుతుండగా మధ్యలో కలిగించుకున్న కాపలాదారుపై మంత్రి అంతెత్తున ఎగిరిపడ్డారు. 'అసలు అడవులు తగలబడటానికి కారణం నువ్వే' అంటూ చెంపపై ఒక్కటిచ్చారు. ఊహించని పరిణామానికి రాంగోపాల్ వర్మ బిత్తరపోయాడు. ఆ సమయంలో ఫారెస్టు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మేనకాగాంధీ తనపై దౌర్జన్యం చేశారని బాధితుడు పురాణ్పూర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కౌశలేంద్ర కుమార్ తెలిపారు.