
పాకిస్థాన్‌ను ఏకి పారేస్తున్నారు!
సాక్షాత్తు ప్రధానమంత్రే తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్‌ను ఎడాపెడా ఏకి పారేయడంతో మంత్రులు కూడా తమ మాటల యుద్ధాన్ని మరింత పదునెక్కించారు. పాకిస్థాన్‌కు వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా.. పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ ఆర్థికమంత్రుల సమావేశానికి తాను వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఆయనకు బదులుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఆ సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
''మన సైనికులు నిన్ననే ఐదుగురు ఉగ్రవాదులను వెనక్కి పంపారు. పాకిస్థాన్‌కు వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానం'' అని పారికర్ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఇప్పుడు వాళ్లు ఆ విధానం అవలంబించడం వల్ల తలెత్తుతున్న పరిణామాలను భరించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
మొత్తమ్మీద ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీయే మంత్రివర్గం మాత్రం పాకిస్థాన్ మీద ఎదురుదాడి వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పాక్ విషయంలోను, పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కూడా భారత్ ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇక మీదట అలా ఊరుకునేది లేదని, కశ్మీర్ సహా భారత భూభాగంలో అంగుళం కూడా ఎవరికీ వదిలేది లేదని స్పష్టం చేయడం ఇటీవలి కాలంలోనే చోటుచేసుకున్న పరిణామం. ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మంత్రులందరూ కూడా పాకిస్థాన్ మీద తమ వ్యాఖ్యల వేడిని పెంచారు. అయితే ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, అంతర్జాతీయ వేదికల మీద చేతల వరకు కూడా వెళ్తుందా అన్నది వేచి చూడాలి.