
ప్రభుత్వ వైఖరి సరికాదు
- విదేశీ బ్యాంకుల్లో ఖాతాదారుల పేర్ల గోప్యతపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి
కోల్‌కతా: విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల పేర్ల గోప్యత విషయంలో ప్రభుత్వం సరైన కారణం చెప్పలేదని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. విదేశాలతో రెండు పన్నులు తప్పించే ఒప్పందం (డీటీఏఏ) కారణంగా పేర్లు వెల్లడించడం సాధ్యంకాదని ప్రభుత్వం చెప్పడం సహేతుకంగా లేదని శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పేర్లు బహిర్గతం చేయకూడదని డీటీఏఏ ఒప్పందంలో ఉన్న నిబంధనను అధిగమించాలన్నారు.
గతం లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు డీటీఏఏ కింద జర్మన్ బ్యాంకు లీక్టెస్టీన్ ఖాతాదారుల పేర్లు వెల్లడించాలని ఆ ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు. అయితే డీటీఏఏ కింద పేర్లు వెల్లడించాలని గత ప్రభుత్వం తప్పుగా కోరిందనే విషయం తెలియజేస్తూ జర్మనీ ప్రభుత్వానికి ప్రస్తుత భారత ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పేర్లు వెల్లడించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్వామి చెప్పారు.
పేర్ల వెల్లడిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేస్తున్న వాదన సరైనది కాదనే విషయం ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశానని ఆయన వెల్లడించారు. గతంలో డీటీఏఏపై బీజేపీ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చాక సిట్‌ను నియమించిందన్నారు. అందువల్ల ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించాల్సిందేనన్నారు.