
పుదుచ్చేరి : రాష్ర్టంలో దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి నారాయణ స్వామి బుధవారం ప్రకటించారు. మే 3 తర్వాత క్రమంగా ఆంక్షలను సడలిస్తామని తెలిపారు. రాష్ర్ట మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మే 3 తర్వాత లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఒకేసారి కాకుండా, దశల వారిగా లాక్‌డౌన్ ఎత్తివేతకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో ముగ్గురు మాత్రమే కరోనాతో చికిత్స పొందుతున్నారని , మంగళవారం 49 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. (సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! )
ఇక ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న కార్మికులు, వలస కూలీలు, విద్యార్థులకు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న పుదుచ్చేరి వాసులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలందరికీ మూడునెలలపాటు ఉచితంగా బియ్యాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31, 787 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో 7,796 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటవరకు 1,008 మంది మృత్యువాత పడినట్లు పేర్కొంది.