'నా చెల్లి రాజకీయాల్లోకి వస్తే చూడాలని ఉంది'
హమీర్పూర్: ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోని చాలామంది సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తుండగా... తొలిసారి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అదే రకమైన అభిప్రాయం చెప్పాడు. తన సోదరి ప్రియాంక గాంధీ రాజకీయ ఆరంగేట్రం గురించి రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరి పూర్తి రాజకీయాల్లో పాల్గొంటే తనకూ చూడాలని ఎప్పటి నుంచి ఉందని అన్నారు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడితే తనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. అయితే, నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిందే ప్రియాంకేనని అన్నారు.
తాను అందరికన్నా తన సోదరి ప్రియాంకనే ఎక్కువగా నమ్ముతానని, ఇష్టపడతానని రాహుల్ చెప్పారు. మరోపక్క, ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆరెస్సెస్ పై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆరెస్సెస్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని, ఎందుకంటే ఆయన అందులో శిక్షణ పొందిన వ్యక్తని విమర్శించారు.
ఆరెస్సెస్, బీజేపీ ఎప్పుడూ మతతత్వ రాజకీయాలను పెంచిపోషిస్తాయని, అలా చేయడమంటే హింసను సృష్టించడమే తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఏ పార్టీతోనూ యూపీలో పొత్తు పెట్టుకోమని చెప్పిన ఆయన ఈసారి యూపీలో అధికారం చేతులు మారబోతుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడుతున్నారని చెప్పారు.