శ్రీనగర్ : పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన మెరుపు దాడులతో తీవ్ర అసహనానికి లోనైన పాకిస్తాన్ బుధవారం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. రాజౌరీ సెక్టార్‌లోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. కాగా, భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఫైటర్ జెట్‌ను భారత వాయుసేన కూల్చివేసిందని అధికారులు చెబుతున్నారు.
భారత్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురవడంతో తోకముడిచిన పాకిస్తాన్ తన యుద్ధ విమానాలను తిరిగి తమ గగనతలంలోకి మళ్లించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో భారత్ నేలమట్టం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అసహనానికి లోనవుతున్న సంగతి తెలిసిందే. భారత్‌కు తమ సత్తా చాటుతామని, సరైన సమయంలో దాడులకు తెగబడతామని పాక్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాటువేసి దొంగ దెబ్బ తీసేందుకూ పాక్ దుర్నీతిని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు ఎప్పటికప్పుడు పాక్ కుయుక్తులను తిప్పికొడుతూ ఎలాంటి పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
విమానాశ్రయాల్లో హైఅలర్ట్
భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లీ, జమ్మూ, శ్రీనగర్, పఠాన్‌కోట్ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఆయా గగనతలాల పరిధిలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకుల విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. పలు కమర్షియల్ విమానాల సర్వీసులను కూడా పెండింగ్‌లో ఉంచారు. మరోవైపు ఉడీ, పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పలువురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment