
గరిష్టస్థాయికి చేరిన నీటి సామర్ధ్యం.. ఇడుక్కిలో బిక్కుబిక్కు..
తిరువనంతపురం : కేరళలో పోటెత్తిన వరదతో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇడుక్కి డ్యామ్‌లో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 2403 అడుగులు కాగా, సోమవారం ఉదయం నీటి పరిమాణం 2397.94 అడుగులకు చేరింది. కేరళలో వరద పరిస్థితి తీవ్రంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రానికి కేంద్రం అవసరమైన సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల్లో కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్‌తో కలిసి రాజ్‌నాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం కేరళకు వరదల వల్ల రూ. 8316 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
రాష్ట్రంలో తక్షణ సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు రూ. 400 కోట్లు అదనంగా విడుదల చేయాలని తాను హోంమంత్రిత్వ శాఖను కోరానని విజయన్ ట్వీట్ చేశారు. భారీ వర్షాళతో దాదాపు 20,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 10,000 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు.